రైతు, కార్మిక వ్యతిరేక మోడీనీ ఓడించండి

Mar 18,2024 16:36 #district, #modi, #vijayanagaram
  • ఏఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు గణేష్‌ పండా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రైతు,కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ, బిజెపి పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఏఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు గణేష్‌ పండా పిలుపునిచ్చారు. సోమవారం విజయనగరం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన రైతు పోరాట ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన నరేంద్ర మోడీ – రైతాంగానికి ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోవడం వల్లే రైతాంగం తిరిగి ఆందోళన కు దిగవలసి వచ్చిందన్నారు. పంటలకు కనీస మద్దతు ధరను గ్యారెంటీ చేస్తూ నేటికీ చట్టం చేయని కారణంగానే తిరిగి రైతాంగం ఆందోళన చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఏఐఎఫ్టీయు న్యూ ఖండిస్తోందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చి కార్మికులపై అదనపు పనిభారాలు మోపి కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా చేస్తున్నదని విమర్శించారు. ధరలు, పన్నుల భారాలు పెంచుతూ వేతనాల్ని పెంచనివ్వడం లేదని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపిని ఈ ఎన్నికలలో ఓడించమని ఏఐఎఫ్‌టియున్యూ ద్వారా పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జె కిషోర్‌ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెహరా శంకర్రావు, రెడ్డి నారాయణరావు పాల్గొన్నారు.

➡️