తక్షణం కాల్పుల విరమణ ప్రకటించండి : గాజాపై బ్రిక్స్‌సమావేశంలో జిన్‌పింగ్‌ పిలుపు

Declare-immediate-ceasefire-Xi-calls-for-BRICS-summit-on-Gaza

సమావేశానికి మోడీ గైర్హాజరు
జోహానెస్‌బర్గ్‌ : ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధంలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని చైనా అధ్యక్షులు సీ జిన్‌పింగ్‌ మంగళవారం పిలుపునిచ్చారు. గాజాపై మంగళవారం జరిగిన బ్రిక్స్‌ వర్చువల్‌ సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ గాజాలో మానవతా సహాయానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. గాజా నుంచి బలవంతంగా పౌరులను తరలించడాన్ని ఖండించారు. ఇజ్రాయిల్‌ దాడులతో దెబ్బతిన్న పాలస్తీనా ప్రాంతాల్లో ఆహారం, మంచి నీరు, ఇంధనం, విద్యుత్‌ సరఫరా పునరుద్దరించాలని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. గాజాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న హంతక దాడులపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ సమావేశానికి చైనా, రష్యా అధ్యక్షులు జిన్‌పింగ్‌, పుతిన్‌ హాజరుగా కాగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖం చాటేశారు.బ్రిక్స్‌ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న దక్షిణాఫ్రికా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోడీకి బదులు విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్లే మోడీ దీనిని దాటవేశారని అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. ”బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్‌, రష్యా, భారతదేశం, చైనా , సౌతాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి. సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌ , యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆహ్వానితుల హౌదాలో ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ కూడా పాల్గొన్నారు. శిఖరాగ్ర సమావేశం ముగింపులో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్లు దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

➡️