రుణ భారతం

Dec 30,2023 07:20 #Editorial

                భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి), రుణాలకు సంబంధించిన నిష్పత్తి ప్రమాదకర స్థితిలో ఉందంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నివేదించడం ఆందోళన కలిగిస్తోంది. భారత ఆర్థిక పునాది బీటలు వారుతోందని ఐఎంఎఫ్‌ వ్యాఖ్యానించిందంటే బిజెపి ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతం రుణాల నిష్పత్తి 82.4 శాతంగా ఉందని ఐఎంఎఫ్‌ నివేదించింది. జిడిపిలో 80 శాతానికి పైగా రుణ భారం ఉండటమనేది ఆర్థిక పరిభాషలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతున్నట్లుగా దేశం ఆర్థికంగా అభివద్ధి చెందుతున్నట్లయితే …ఆ మేరకు జిడిపిలో రుణ నిష్పత్తి కూడా తగ్గాలి. కానీ అది వ్యతిరేక దిశలో ఉంది. వాస్తవానికి 2018 నుంచి అప్పులు పెరిగాయి. 2019 చివరి నాటికి, స్థూల దేశీయోత్పత్తి – రుణాల నిష్పత్తి 74 శాతంగా ఉంది. ప్రస్తుతం అది 82.4 శాతానికి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వం అందించిన అధికారిక సమాచారం ఆధారంగానే ఐఎంఎఫ్‌ నివేదికలు రూపొందిస్తుంది. అంటే దేశాభివృద్ధి అంతా డొల్ల అని, తిరోగమన దిశలో పతనమవుతోందన్న విషయాన్ని మోడీ సర్కార్‌ గణాంకాలే నిగ్గుతేల్చుతున్నాయి. గత రెండేళ్లలో రుణాలు, జిడిపి నిష్పత్తి శాతం 88 నుంచి 81కి తగ్గిందని కేంద్రం నిస్సిగ్గుగా బుకాయిస్తోంది. పైగా రానున్న రెండేళ్లలో ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికి తగ్గిస్తామంటూ గాల్లో మేడలు కడుతుండటం సిగ్గుచేటు.

జీవనోపాధులు క్షీణించడం, ఆహార ద్రవ్యోల్బణం ఎగబాకడం, రుణభారాల మోత సహజంగానే అంతర్జాతీయంగా భారత ద్రవ్య పరపతిని కుదించివేస్తాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేనాటికి దేశ అప్పు రూ.55.87 లక్షల కోట్లుగా ఉండగా అది ఈ ఏడాది మార్చి నాటికి 155.31 లక్షల కోట్లుకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 169.46 లక్షల కోట్లకు చేరనున్నట్లు బడ్జెట్‌ అంచనాల్లో కేంద్రమే పేర్కొంది. గణాంకాల్లో పేర్కొనని అప్పు మరో రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఒకవైపు రుణాల ఊబిలో నిండా మునిగిన మోడీ సర్కార్‌ మరోవైపు రాష్ట్రాలు ఆర్థిక క్రమ శిక్షణ పాటించాలంటూ నీతులు చెబుతుండటం దాని ద్వంద్వనీతికి నిదర్శనం. ప్రధానంగా బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో రుణాలకు ఆంక్షలు విధిస్తూ అభివృద్ధికి మోకాలడ్డుతోంది. వేలాది కోట్ల రూపాయల సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్న కేంద్రం..రాష్ట్రాల్లో పేదలకు అమల్జేస్తున్న సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’ ముద్ర వేస్తూ అడ్డుకునేందుకు ఈ రుణ షరతులు విధిస్తోంది. వాస్తవానికి కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాల్లో రుణాలు, ఎస్‌జిడిపి నిష్పత్తి శాతం చాలా తక్కువ. కేరళలో ఇది 36 శాతం మాత్రమే. కోవిడ్‌ కాలంలో కేరళ అప్పుల భారం 39 శాతానికి చేరినా అక్కడి వామపక్ష ప్రభుత్వం స్వల్ప వ్యవధిలోనే అత్యల్ప స్థాయికి తీసుకొచ్చింది. కేరళ ఆర్థిక వద్ధిని, అప్పుల భారాన్ని పోల్చి చూస్తే..ఆర్థిక క్రమశిక్షణకు ఆదర్శంగా నిలుస్తోంది.

వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కారణంగా కేంద్రం పన్నుల వసూళ్లు భారీగా పెరిగినప్పటికీ మోడీ సర్కార్‌ ఏలుబడిలో ద్రవ్యలోటు విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ద్రవ్యలోటు 6 శాతానికి మించి నమోదు కానుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇదివరకే హెచ్చరించింది కూడా. కానీ రెండేళ్లలో దీనిని 4.5 శాతానికి కుదిస్తామన్న మోడీ సర్కార్‌ ఈ దఫా బడ్జెట్‌ లక్ష్యంగా 5.9 శాతానికి కుదిస్తామని నమ్మబలుకుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, రెవెన్యూ లోటును తగ్గించుకొని ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితమయ్యేలా చూడాలని 2003లో తీసుకొచ్చిన ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బిఎం యాక్టు) నిర్దేశిస్తోంది. ఈ నిబంధనలను పాటించని బిజెపి సర్కార్‌ కేరళ వంటి రాష్ట్రాలకు మాత్రం షరతులను విధిస్తూ రుణాలకు అనుమతిని నిరాకరించడం ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై కక్ష సాధించడం మినహా మరొకటి కాదు. రుణ మంజూరును అడ్డుకోవడం ద్వారా రాష్ట్రాలను తమ కీలుబొమ్మలుగా మలుచుకోవాలన్నది మోడీ సర్కార్‌ పన్నాగం. సమాఖ్య స్ఫూర్తిని నీరుగార్చే ఇలాంటి దుర్మార్గ చర్యలను అడ్డుకోవాలి.

➡️