చైనాలో పెను భూకంపం

Dec 20,2023 09:19 #China, #Earthquake

– 118 మంది మృతి

– 536 మందికి గాయాలు

బీజింగ్‌ : వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం జనజీవితాలను అతలాకుతలం చేసింది. భూకంప ధాటికి రహదారులు, ఇళ్లు ధ్వంసయ్యాయి. దీంతో 118 మంది మరణించారు. 536 మంది గాయపడ్డారు. చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం వెల్లడించిన ప్రకారం సోమవారం రాత్రి 11:59 గంటలకు భూకంపం సంభవించింది. లియుగౌ టౌన్‌షిప్‌కు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్లు లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. కంపన తీవ్రతకు 1,55,393 ఇళ్లు నేలమట్టమయ్యాయని, రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. విద్యుత్‌ స్థంబాలు నేలకొరగడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రి వేళ సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ సహాయక సిబ్బంది హెడ్‌ లైట్స్‌, సెల్‌ఫోన్‌ వెలుగుల్లోనే సహాయక చర్యలు కొనసాగించారు. వేలాది మంది ప్రాణాలను రక్షించారు. భూకంప బాధితలను అన్ని విధాలా ఆదుకుంటామని చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌ ధైర్యం చెప్పారు. అలాగే క్షతగాత్రులను సకాలంలో రక్షించాలని, వాతావరణ మార్పులను నిశితంగా పర్యవేక్షించాలని కూడా ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాలకు వీలైనంత త్వరగా సహాయ సామాగ్రిని తరలించాలని కోరారు. విద్యుత్‌, కమ్యూనికేషన్లు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని నిర్దేశించారు.

➡️