కూతురమ్మ

Apr 7,2024 08:27 #Poetry, #Sneha

వేలచందమామలు ఓ పక్క
కూతురో పక్క
కచ్చితంగా
కూతురి జట్టుకట్టి
వెన్నెల్ని ఎక్కిరిపిస్తుంటాను

పలకమీద రాసింది
నాన్న పదాన్నే పదేపదే
అమ్మ పదం రాయమంటే
బువ్వ తిననప్పుడు
అమ్మ కొట్టిన సంగతులు చెబుతున్నది

చేతులు వదిలేసి
సైకిల్‌ తొక్కుతుంటది
పడిపోతావురా అంటే
నా ఎన్క నాన్నుండాడంటుంది
తనవెనక తనే వుండాలంటాను నేను

పూలతోటలో
అన్నీ సీతాకోకచిలుకలే
నా కూతురమ్మనెలా కనిపెట్టాలి
జడలసీతాకోక దొరికేసింది

చేపలకూర కంచంలో వడ్డించాక
తిననంటుంది
ఇప్పుడు
చెరువమ్మకి జత ఎవరంటూ..!?
నా భుజాలనెక్కి
సాయంత్రమై ఆడుకుంటూ
ఎర్రని సంధ్య సూరీణ్ణి
కొరుక్కుతింటానంటుంది
వేడిపండు పెదాల్ని కాల్చుతుంది..
వద్దంటాను!

ఒకసారి సైకిల్‌ తొక్కుతూ
పడిపోయింది
కంటిరెప్పకి గాయమైతే
అది తగ్గేవరకు
వాత్సల్యం కన్రెప్ప వాల్చలేదు

వాళ్లమ్మతో ఊరికెళ్లింది
నెలరోజులు రానని ఆటపట్టిస్తోంది
సాయంత్రానికే
నేను కూతురు నీడనక్కడ!

ఈ నాన్నగుండెకు
ఊపిరి వుంది
కూతురమ్మ
పట్టీల సంగీతంగా అది ధ్వనిస్తోంది!

పాప బడికెళ్లి
అరగంట ఆలస్యమైతేనే కంగారు
రేపటి అప్పగింతలు క్యాన్సిల్‌ …
ఇల్లరికపు వరుణ్ణి వెతకాలి!

– మెట్టా నాగేశ్వరరావు, 9951085760

➡️