ప్రమాదాలు !

Feb 28,2024 07:15 #Editorial

                    రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రాష్ట్రంలో గత వారం రోజులుగా చోటుచేసుకున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే వేర్వేరు ప్రమాదాల్లో పదిమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 25 మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మరో ఘటనలో… మిర్చి యార్డులో మిరప పంట అమ్మగా వచ్చిన రూ.10 లక్షల నగదుతో ఇంటికి బయల్దేరిన ముగ్గురు రైతులు ఆటో ప్రమాదంలో నగదుతోపాటు బుగ్గి కావడంతో ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత సైతం ఈ వారంలోనే కారు ప్రమాదానికి బలయ్యారు…ఇలా ఎన్నో ప్రమాదాలు.

ఏడెనిమిది సెకన్లలోనే వంద కిలోమీటర్లకుపైగా వేగాన్నందుకునే బైకులు, కారులు, ఇతర వాహనాలు ఒక వైపు… రాష్ట్రంలో గుంతలు, ఎగుడుదిగుళ్లతో నరకానికి నకళ్లుగా మారిన రహదారులు మరోవైపు.. ఉన్నాయి. మితిమీరిన వేగానికి తోడు నిద్ర లేమి, విపరీతమైన పని ఒత్తిడి, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం.. ఇవన్నీ విలువైన ప్రాణాలను బలిగొంటున్నాయి. కొన్ని దేశాల్లో వాహనాల ఉత్పత్తి దశలోనే స్పీడ్‌ కంట్రోల్‌కు అవసరమైన చర్యలు చేపట్టి అద్భుత ఫలితాలు సాధిస్తుండగా, మనదేశంలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గి అభివృద్ధి చెందిన దేశాల రహదారులకు అనువైన మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలకు ఇక్కడ అనుమతిస్తున్నారు. వీటికి అనుమతించడంలో ఉన్న శ్రద్ధ, రహదారుల అభివృద్ధిపైనా, సరైన భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం… సామాన్యుల ఉసురుతీస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఏటా 13 లక్షల మంది ఉసురుతీస్తున్నాయి. మరో రెండు కోట్లకుపైగా క్షతగాత్రులవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారని 2022 నాటి కేంద్రప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారే 69 శాతం. అంతకుముందుటేడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలు 5 శాతం తగ్గితే, మనదేశంలో 11.9 శాతం ప్రమాదాలు, 9.45 శాతం మరణాలు, 15.3 శాతం క్షతగాత్రులు పెరగడం ఆందోళనకరం. క్షతగాత్రులకు వీలైనంత వేగంగా వైద్య చికిత్స అందేలా చూడటం అత్యంత ప్రధానమైనదే. తీవ్రగాయాల పాలైన కుటుంబ సభ్యుల వైద్యం కోసం చాలా కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి.

మన రాష్ట్రంలో ద్విచక్ర వాహన ప్రమాదాలే అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది మొత్తంగా 18,413 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 7,977 మంది ప్రాణాలు కోల్పోగా, 20 వేల మంది గాయాల పాలయ్యారు. వీటిలో అత్యధికంగా 6,370 ద్విచక్ర వాహన ప్రమాదాలే. కార్లు, జీపుల వంటి వాహనాలు 4,462, ఆటోలు 1,869 ప్రమాదాలకు గురయ్యాయి. ఇక బస్సు ప్రమాదాలు భారీగానే జరిగాయి. గత కొంతకాలంగా గ్రామీణ రూట్లలో కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా కాలం చెల్లిన వాటితోనే రోజులు గడపడం, నిర్వహణ లోపం కారణంగా ఆర్‌టిసిలో మంచి అనుభవం ఉన్న డ్రైవర్లు ఉన్నప్పటికీ బస్సులు ప్రమాదాల బారినపడుతున్నాయి.

ఉపాధి మార్గాలు కుంచించుకుపోతున్నాయి. మోడీ సర్కారు ఏలుబడిలో… గత మూడేళ్లలో ఉపాధి హామీ పనిదినాలు కోటి తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో పనులు వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పనికోసం నిత్యం ఆటోలు, లారీలు, వ్యాన్లు తదితర వాహనాల్లో వెళ్లే… వీరు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. రోడ్‌ సెస్‌ వసూలు చేయడంపైనున్న శ్రద్ధలో కొంతయినా రోడ్ల నిర్వహణపై పెట్టాలి. వసూలైన సెస్‌ సొమ్ము కొత్త రోడ్ల నిర్మాణానికి, ఉన్నవాటి నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలి. అలాగాకుండా ప్రభుత్వాలు ‘తమ’ ప్రాధాన్యతలను బట్టి మళ్లించకుండా కట్టుదిట్టమైన నిబంధనలుండాలి. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకునేందుకు సకల చర్యలు చేపట్టాలి.

➡️