విదేశీ స్కాలర్‌షిప్‌లలోనూ కోత

Mar 19,2024 00:42 #Cut, #foreign, #PM Modi, #scholarships
  •  ఎస్‌టి విద్యార్థులకు ప్రాణసంకటంగా మోడీ సర్కారు సవరణలు

న్యూఢిల్లీ : విదేశాల్లో చదువుతున్న ఆదివాసీ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన మోడీ సర్కారు అందుకు భిన్నంగా వారికిస్తున్న ప్రోత్సాహకాలను భారీగా కుదించింది. బిజెపి పాలనలో తీసుకొచ్చిన నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఒసి) సవరించిన నిబంధనలతో ఎస్‌టి విద్యార్థులకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో టాప్‌-1000లో ఉన్న అగ్రశ్రేణి విదేశీ విద్యాలయాల్లో ఎస్‌టి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వారికి పూర్తి నిధులను అందించే లక్ష్యంతో నిబంధనలు సవరించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గొప్పగా చెబుతోంది. వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఒసి) 1954 నుంచి అమల్లో ఉంది. ఆ పథకం నిబంధనలను 2022లో బిజెపి ప్రభుత్వం సవరించడంతో అమలులో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సవరించిన ఎన్‌ఒసి నిబంధనలు 4.4 సెక్షన్‌ ఎ ‘మెరిట్‌ జాబితా తయారీ’ ప్రకారం.. ‘టాప్‌-1000 విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే ప్రవేశం పొందిన, అధ్యయనం చేస్తున్న ఎస్‌టి విద్యార్థులకు’ తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో తప్పేమీ ఉందనుకుంటున్నారా.. బిజెపి ప్రభుత్వ అసలు తిరకాసు ఇక్కడే ఉంది. ఒకవేళ ఈ పథకానికి సదరు విద్యార్థి ఎంపికైతే, ఎంపికైనట్లు లేఖ ఇచ్చిన తేదీ నుంచి మాత్రమే స్కాలర్‌షిప్‌ ఇస్తారు. పైగా విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు అప్పటికే చెల్లించిన ఫీజులు, బీమా మొదలైన ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌ చేయరు. దీంతో విద్యార్థులకు చాలా నష్టం కలుగుతోంది. ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో కోర్సుల్లో చేరడానికి ముందే విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అప్పటికే ఫీజులు చెల్లించిన విద్యార్థులు పథకానికి ఎంపికైనా ఫీజులు రీయంబర్స్‌మెంట్‌ కాక వారు ఇబ్బందులు పడుతున్నారు.
సవరించిన మరో నిబంధన ప్రకారం గిరిజన మంత్రిత్వ శాఖ మాత్రమే ప్రతి విద్యాసంవత్సరంలో 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి పూర్తి సాల్కర్‌షిప్‌ ఇవ్వాలి. ఈ మంత్రిత్వ శాఖ వద్ద 20 మంది విద్యార్థులకు కావాల్సిన నిధులు ఉండవు. కాబట్టి 20 మంది కంటే తక్కువ విద్యార్థులను మాత్రమే పథకానికి ఎంపిక చేస్తోంది. ఉదాహరణకు 2023-24లో మంత్రిత్వ శాఖ 17 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసింది. పైగా ఇందులో 15 మంది అప్పటికే వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొంది ఉన్నారు. వారు అప్పటికే ట్యూషన్‌, ఇతర ఫీజులు చెల్లించివున్నారు. మరోవైపు ఎన్‌ఓసికి ఎంపికైన సోషల్‌సైన్స్‌ విద్యార్థులు భారత్‌కు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేయకుండా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ నియంత్రణ విధించింది. అదేవిధంగా గిరిజన మంత్రిత్వ శాఖ కూడా ఈ పథకానికి ఎంపికచేసే సోషల్‌సైన్స్‌ విద్యార్థుల సంఖ్యను ఐదు నుంచి రెండుకు తగ్గించింది. ఇలాంటి చర్యలు కుల అణచివేత, ఆదివాసీలను ప్రభుత్వం అణచివేయడం వంటి క్లిష్టమైన సామాజిక సమస్యల చుట్టూ విద్యార్థుల చర్చలు జరగకుండా చేసే విధానంలో భాగంగా తీసుకున్నవే.
ఈ ఏడాది జనవరిలో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐఎస్‌హెచ్‌ఇ) నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఉన్నత విద్యను అభ్యసించే ఎస్‌టి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014-15తో పోలిస్తే 2021-22లో ఉన్నతవిద్యలో ఎస్‌టి విద్యార్థుల సంఖ్య 65.2 శాతం పెరిగింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్‌టి విద్యార్థుల సంఖ్య పెరుగుతోందంటే దాని అర్థం ఉన్నత విద్యావకాశాలను, విదేశీ విద్యావకాశాలను కోరుకునే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందనే. ఇలాంటి నేపథ్యంలో ఎన్‌ఒసి పథకానికి నిధులు కేటాయింపులు పెంచాలి. పథకానికి ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్యను కూడా పెంచాలి. బిజెపి ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా పథకం నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చి, విద్యార్థుల సంఖ్యను కుదిస్తోంది. మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలు కులతత్వం, జాత్యహంకారానికి, ఆదివాసీల పట్ల ఉన్న వివక్షకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.

➡️