భారత్‌లో 16 శాతం తగ్గిన ముడిచమురు చెల్లింపులు

Apr 18,2024 12:38 #crude oil, #discount, #India, #russia

న్యూఢిల్లీ :    దిగుమతుల పరిమాణంలో పెద్దగా మార్పులేకపోయినప్పటికీ.. 2023-24లో భారతదేశ ముడి చమురు దిగుమతి చెల్లింపులు సగటున 16 శాతం తగ్గి,  132.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.  రష్యా ముడి చమురు సరఫరాపై డిస్కౌంట్‌ ప్రకటించడంతో ఈ మేరకు తగ్గినట్లు పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ఇటీవలి సమాచారం తెలిపింది.  గతేడాది ముడి చమురు దిగుమతి చెల్లింపులు  157.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, పశ్చిమదేశాల నుండి ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ..   భారత్‌కు ముడి చమురును అందించే  ప్రధాన సరఫరాదారుగా రష్యా నిలిచింది.   ఆంక్షలు ప్రారంభమైనప్పటి నుండి ఈ  డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది.     ప్రారంభంలో బ్యారెల్‌కు 30 డాలర్లకు పైగా ఉండగా, ప్రస్తుతం బ్యారెల్‌కు 5-6డాలర్ల మేర డిస్కౌంట్ ఉన్నట్లు  విశ్లేషకులు పేర్కొన్నారు.   డిస్కౌంట్‌లు   కొంత మేర తగ్గినా ..  గతేడాది భారత్‌ 232.7 మిలియన్‌ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకోగా,  FY  24లో స్వల్పంగా తగ్గి 232.5 మిలియన్‌ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది.

అయినప్పటికీ అధిక వినియోగం కారణంగా ముడిచమురు కోసం దేశం దిగుమతులపై ఆధారపడటంతో FY  23లో 87.4 శాతం నుండి FY 24లో 87.7 శాతానికి పెరిగింది. భారత్‌లో రిఫైండ్‌ ఆయిల్‌ ఉత్పత్తుల వినియోగం FY 23లో 223 మిలియన్‌ టన్నులు ఉండగా, 4.6 శాతం పెరిగి FY లో 233.3 మిలియన్‌ టన్నులకు పెరిగింది. పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, లిక్విడ్‌ పెట్రోలియం వంటి ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి దారితీసింది.

దేశీయ ఉత్పత్తిలో స్తబ్థత
భారత్‌ దాదాపు 88 శాతం దిగుమతులపై ఆధారపడగా, దేశీయ ఉత్పత్తి స్తబ్దుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. భారత్‌లోని సంస్థలు FY  24లో 29.4 మిలియన్‌ టన్నుల ముడిచమురును ఉత్పత్తి చేయగా,  FY 23లో  29.2 మిలియన్‌ టన్నులు (స్వల్ప తేడానే ) ఉత్పత్తి చేశాయి.    ముడిచమురు నుండి గ్యాస్‌ ఉత్పత్తి లక్ష్యం 19.2 మిలియన్‌ టన్నులు ఉండగా, కేవలం 18.1మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. FY 23లో 18.4 మిలియన్‌ టన్నులతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ అని నివేదిక పేర్కొంది. ఆయిల్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 3.3 మిలియన్‌ టన్నుల ముడిచమురును ఉత్పత్తి చేయగా, నిర్దేశిత లక్ష్యం 3.4 మిలియన్‌ టన్నుల కన్నా స్వల్పంగా తగ్గింది. కానీ FY 23 ఉత్పత్తి 3.2 మిలియన్‌ టన్నుల కన్నా ఎక్కువ.

దిగుమతులపై ఆధారపడటం ఆందోళనకరం
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు మార్కెట్‌ అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భారత్‌ దిగుమతులపై ఆధారపడటం అధికమౌతోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముడి చమురు ధరలు రెండు వారాల క్రితం బ్యారెల్‌ 90 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం బ్యారెల్‌ 89 డాలర్ల వద్ద ఉంది. ఇరాన్‌ ఇజ్రాయిల్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైతే బ్యారెల్‌ ధర 95 డాలర్ల నుండి 100 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️