అధికార పార్టీ అండతో అడ్డగోలు తవ్వకాలు

Apr 22,2024 00:45

ప్రజాశక్తి-తెనాలి : అక్రమార్కులు ధనార్జనకు మట్టి తవ్వకాలను అడ్డాగా ఎంచుకున్నారు. దానికి అధికార పార్టీనాయకులు, అధికారుల అండదండలు పుష్కలంగా లభించటంతో నిబంధనలను తుంగలోతొక్కారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం నిలిపివేసిన క్వారీ తవ్వకాలను వైసిపి ప్రభుత్వంలో పున:ప్రారంభించారు. జగనన్న కాలనీ మెరకల కోసమంటూ బురిడీ కొట్టించి క్వారీ తవ్వకాలకు తెరతీశారు. కాలనీ మెరకలకు ఉపయోగపడేది పదిశాతమైతే, అడ్డగోలు విక్రయాలకు 90శాతం తరలించేస్తున్నారు. స్థానిక శాసనస కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ క్వారీ తవ్వకాలకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు పంచాయతీ పరిధిలో దాదాపు 20 ఏళ్ళ క్రితం అడ్డగోలుగా క్వారీ తవ్వకాలు జరిగాయి. కొలకలూరు- అనుమర్లపూడి డొంకరోడ్డులో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 100 ఎకరాలలో మట్టి కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్దంగా తాడిచెట్టులోతున మట్టి తవ్వేసి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. అదే సమయంలో మట్టి పెళ్ళలు విరిగి పడి కొలకలూరు ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు ఒకే రోజు మృత్యువాత పడటం సంచలనం రేకెత్తించింది. దీనికి తోడు పొలాల పక్కనే లోతుగా తవ్వేయటంతో పంట పొలాల్లో నీరు నిలిచేది కాదు. దీంతో దాదాపు 2004-05 కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ప్రజాపధం కార్యక్రమంలో క్వారీలను నిలుపు చేయాలని స్థానికులు అదికారులను కోరారు. దీంతో స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు క్వారీ తవ్వకాలను పరిశీలించి ముక్కున వేలేసుకున్నారు. మైనింగ్‌ అధికారులతో మాట్లాడి తక్షణమే క్వారీ తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే భవిష్యత్‌లో కొలకలూరులో క్వారీ తవ్వవకాలకు అనుమతులివ్వ కూడదంటూ జెడ్పీలోనూ. పంచాయతీలోనూ తీర్మానించినట్లు అప్పట్లోనే అధికారులు స్పష్టం చేశారు. దీంతో క్వారీ తవ్వకాలు శాశ్వతంగా మూత పడ్డాయి. తదుపరి 2009లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంకాని, 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి కాని కొలకలూరులో క్వారీ తవ్వకాలకు సాహసించలేదు. అడ్డగోలు తవ్వకాలకు తెరతీసిన వైసిపిఇదిలా ఉంటే 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పేదల సంక్షేమం పేరిట దోపిడీకి తెరతీసింది. పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు జరిపిన భూసేకరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు కోట్టాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్న సంగతి బహిరంగ రహస్యమే. నివేశన స్థలాలు లబ్దిదారులకు కేటాయించి, జగనన్న కాలనీగా వాటికి నామకరణం చేశారు. అంతటితో ఆగకుండా ఆ స్థలాలకు మెరకల పేరిట మట్టితవ్వకావలకు ఆజ్యం పోశారు. నిబంధనలను గాలికి వడిలేశారు. జగనన్న కాలనీకి ఆనుకునే మట్టి తవ్వకాలు చేపట్టారు. మైనింగ్‌ అనుమతులకు భిన్నంగా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పంటపాలాలున్న నేపధ్యంలో నాలుగు మీటర్ల లోతుకు మించి తవ్వ కూడదు. నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 12 మీటర్ల లోతు తవ్వేశారు. తవ్వకాలను అనుమతించిన మైనింగ్‌ అధికారులుగాని, రెవిన్యూ అధికారులు గాని అటువైను కన్నెత్తి కూడా చూడలేదు. అధికార పార్టీపై స్వామిభకత్తో, మామూళ్ళ మత్తులో జోగుతున్నారో తెలియదుగాని అడ్డగోలు తవ్వకాలపై మాత్రం పెదవి విప్పటంలేదు. దీనిపై కొందరు గ్రామస్తులు నేరుగా ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను కలిసి విషయం వివరిస్తే ఆయన ఆగ్రహించినట్లు సమాచారం. జగనన్న కాలనీ మెరకలకు మట్టి ఎక్కడి నుంచి తేవాలో చెప్పండంటూ తిరిగి ప్రశ్నించారని, మట్టి తవ్వకాలు ఆపే ప్రసక్తే లేదని చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అడ్డగోలు మట్టి తవ్వకాలకు ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జగనన్న కాలనీకి కనీసం 10శాతం మట్టికూడా ఉపయోగించటంలేదు. కాలనీపేరిట అంతా అక్రమంగా విక్రయించేస్తున్నారు. ఈ ప్రాంతంలో అంతా దాదాపుగా ఎస్సీల భూములే ఉన్నాయి. గతంలో క్వారీలతో వ్యవసాయం చేయలేక కొంత మంది మట్టి మాఫియాకు విక్రయించారు. సుదీర్ఘ విరామం తరువాత మట్టి మాఫియా క్వారీ తవ్వకాలను సాగిస్తుండటంతో ఉన్న కొద్దిపాటి భూములను విక్రయించాలన్నా బాధే. అలాగని వ్యవసాయం చేయాలన్నా బాధేనని స్థానికులు వాపోతున్నారు. నివేశన స్థలాలు కేటాయించి, వాటికి ఆనుకేనే పెద్దఎత్తున జరుగుతున్న క్వారీ తవ్వకాలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్వారి గుంతల్లో పశువులు, చిన్నారులు మృత్యువాత పడిన సందర్భాలు లేకపోలేదు. అప్పట్లో తవ్విన పెద్దపెద్ద గోతులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇప్పటికైనా అదికారులు స్పందించి అక్రమ క్వారీ తవ్వకాలను నిలుపుచేయాలని కోరుతున్నారు.

➡️