ప్రచారం పైనే మోజు !

Dec 31,2023 10:11 #Crazy, #propaganda
  • ప్రజల సొమ్ము సెల్ఫీ బూత్‌ల పాలు
  • గాలిలో దీపంలా ప్రయాణికుల భద్రత
  • మోడీ ప్రచార వేదికలుగా రైల్వే స్టేషన్లు

రైల్వే స్టేషన్లకు ప్రతి రోజూ లక్షలాది మంది వస్తుంటారు. ప్రయాణించే వారు, వారికి వీడ్కోలు పలికేందుకు వచ్చే వారితో స్టేషన్లు అనునిత్యం కిటకిటలాడుతుంటాయి. రాజకీయ ప్రచారాలు ఆశించే వారికి రైల్వే స్టేషన్ల కంటే అనువైన వేదికలు ఎక్కడ లభిస్తాయి? అందుకే ప్రధాని మోడీకి, ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం రైల్వే స్టేషన్లను ఎంచుకుంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువేముంటుంది? రైల్వే స్టేషన్లే కాదు…విమానాలు కూడా ప్రభుత్వ ప్రచార కేంద్రాలుగా మారిపోయాయి. న్యూఢిల్లీ : ప్రజల నుండి వసూలు చేసే పన్నులు, సుంకాలతోనే ప్రభు త్వాలు నడుస్తాయి. అయితే ఈ సొమ్ముకు ధర్మకర్తగా, జవా బుదారీగా వ్యవహరించాల్సిన పాలకులు దానిని పూర్తిగా విస్మరించి తమ స్వీయ ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇందుకు ఉదాహరణ. ప్రజల సొమ్మును అది ఎలా ఖర్చు చేస్తోందో పరిశీలిస్తే…ఉదాహరణకు రైల్వే శాఖనే తీసుకుందాం. భారతీయ రైల్వేలో 19 జోన్లు ఉన్నాయి. వాటిలో సెంట్రల్‌ రైల్వే ఒకటి. దాని కేంద్ర కార్యాలయం ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌లో ఉంది. ఒక్క సెంట్రల్‌ రైల్వే పరిధిలోని స్టేషన్ల ప్లాట్‌ఫారాల పైనే 20 శాశ్వత సెల్ఫీ బూత్‌లు ఏర్పాటు చేశారు. అందుకోసం ఒక్కో దానిపై రూ 6.25 లక్షల చొప్పున మొత్తం రూ.1.25 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు 32 తాత్కాలిక బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో దానిపై రూ.1.25 లక్షలు వ్యయం చేశారు. అంటే మొత్తంమీద రూ.40 లక్షలు ఖర్చయ్యాయి. వీటన్నింటినీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ఈ సెల్ఫీ బూత్‌లలో ప్రధాని నరేంద్ర మోడీ లైఫ్‌-సైజుతో 3డీ మోడల్‌ కటౌట్లు ఉంటాయి. ఇకపై రైలు ఆలస్యంగా వస్తోందని ప్రయాణికులు విసుగు చెందాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా మోడీ కటౌట్‌ వద్ద నిలబడి సెల్ఫీ దిగవచ్చు. ఫోన్‌ కెమేరాతో తీసిన ఆ దృశ్యాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్‌ చేసుకోవచ్చు. ఇదంతా మోడీకి ప్రాచుర్యం కల్పించేందుకు ఉద్దేశించినదేనని చెప్పాల్సిన పనే లేదు. ఇలా దేశంలోని రైల్వే స్టేషన్లన్నీ మోడీ ప్రచార వేదికలుగా మారబోతున్నాయి.

ఎన్ని ప్రమాదాలు జరిగినా…

రైల్వే స్టేషన్లలో సెల్ఫీ పాయింట్ల ఏర్పాటే ఇప్పుడు జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయంగా మారిపోయింది. రైల్వే ప్రమాదాలు, వాటిలో ప్రాణనష్టం గురించి పెద్దగా ఆలోచించే వారే లేరు. ఈ ఏడాది జూన్‌ 2వ తేదీన ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లా బహానగా రైల్వే స్టేషన్‌ సమీపంలో మూడు వేర్వేరు ట్రాక్‌లపై ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్సు రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయిందీ ఇప్పటి వరకూ కచ్చితంగా ఎవరూ చెప్పలేదు. అయితే 300 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. గత సంవత్సరం జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దార్‌ వద్ద బికనీర్‌-గౌహతి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో తొమ్మిది మంది చనిపోగా 36 మంది గాయపడ్డారు. 2017 ఆగస్ట్‌ 23న ఢిల్లీ వెళుతున్న కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉత్తరప్రదేశ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో కనీసం 70 మంది గాయపడ్డారు. అదే సంవత్సరం ఆగస్ట్‌ 18న ముజఫర్‌నగర్‌లో పూరీ-హరిద్వార్‌ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మందికి గాయాలయ్యాయి. 2016 నవంబర్‌ 20న కాన్పూర్‌ సమీపంలో ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 150 మంది అశువులు బాసారు. సుమారు 200 మంది గాయపడ్డారు. ప్రభుత్వానికి ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ ప్రమాదాల నివారణ మీద లేదు.

ప్రాధాన్యతలే వేరు

మరోవైపు రైల్వే భద్రత, ప్రయాణికులకు అవసరమైన స్లీపర్‌ బోగీలు, సీట్ల ఏర్పాటుకు కావాల్సిన నిధుల కేటాయింపునకు బడ్జెట్‌లో చోటే లేకుండా పోతోంది. దాని కంటే స్టేషన్లలో సెల్ఫీ బూత్‌ల ఏర్పాటుకే ప్రాధాన్యత లభిస్తోంది. వాస్తవానికి రైల్వేలో భద్రతా ప్రమాణాలు రానురానూ దిగజారిపోతున్నాయి. దానిని గురించి పట్టించుకునే నాధుడేడి? మరోవైపు నాన్‌-ఏసీ స్లీపర్‌ బోగీల సంఖ్యను బాగా తగ్గించి, సంపన్నుల ప్రయోజనాల కోసం ఏసీ బోగీలను పెంచుతున్నారు. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే బోగీలన్నీ కిటకిటలాడుతున్నాయి.

➡️