Supreme Court : బెయిల్‌ షరతులతో వారిని అడ్డుకోలేం

న్యూఢిల్లీ   :   బెయిల్‌ షరతులతో ఓ వ్యక్తిని రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకుండా  కోర్టులు అడ్డుకోలేవని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది.  ఒడిశా హైకోర్టు విధించిన ఈ బెయిల్‌ షరతును సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.    ఇటువంటి షరతు విధించడం పిటిషన్‌దారుని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, షరతులు విధించకూడదని జస్టిస్‌ బి.ఆర్‌ గవై, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మార్చి 22న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో హైకోర్టు విధించిన షరతును తాము రద్దు చేసి, పక్కన పెడతామని ధర్మాసనం తెలిపింది.

జనవరి 18న ఒడిశా హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బెర్హంపూర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ మాజీ మేయర్‌ శివ శంకర్‌ దాస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2022 ఆగస్టులో బెయిల్‌పై విడుదల సందర్భంగా హైకోర్టు ఈ షరతును విధించింది. అయితే  మాజీ  మేయర్‌ శివ శంకర్‌ దాస్‌ రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు  అనుమతించాల్సిందిగా ఆయన  తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

➡️