కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి : ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 5,2024 12:06 #Kakinada, #MLC KS Lakshmana Rao

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో “భారత రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – ఎన్నికల వ్యవస్థ” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లక్ష్మణరావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలకు అనుగుణంగా సుమారు 3 సంవత్సరాల పాటు అంబేడ్కర్ కృషితో భారత రాజ్యాంగం ముసాయిదా తయారు చేయబడి, రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందిందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గాన్ని మన దేశం ఎంచుకుంటున్నారు. 1980 వరకు నడిచిన రాజకీయాలు, ప్రజా ప్రతినిధులు ఒక తరహాకు చెందిన వారని తెలిపారు. 1991 నుండి దేశంలో అమలైన నూతన ఆర్ధిక విధానాలు, ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ వల్ల రాజకీయాలు పూర్తిగా కార్పొరేట్ మయం అయిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం భారత పౌరులు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు. అయితే ఆచరణలో సామాన్యులు, ప్రజా సేవ చేద్దామనే సంకల్పం కలిగిన వారు చట్టసభలకు నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ లో అనేక మార్పులు వస్తున్నాయన్నారు. అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా దేశంలో కొంతవరకైనా ప్రజాస్వామ్యం నిలబడడానికి భారత రాజ్యాంగమే కారణమన్నారు. భారత ప్రజలు చాలా విజ్ఞత కలవారని, ఎన్నికల ద్వారా పాలకులకు సరైన సమయంలో గుణపాఠం చెబుతూ ఉంటారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దామాషా ప్రాతినిధ్య పద్దతి వస్తే బావుంటుందన్నారు. అలాగే రాజకీయ పార్టీలలో కనీసం 5 సంవత్సరాల పాటు క్రియాశీలకంగా పనిచేసే వారే పోటీ చేసే అవకాశం ఉండేలా నిబంధన ఉంటే బావుంటుందన్నారు. మొత్తంగా ప్రజాస్వామ్య మనుగడకు కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలన్నారు. సదస్సు కు మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి స్వాగతం పలుకగా, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు వందన సమర్పణ చేశారు. కొండలరావు, తానీషా, హరి లు ఆలపించిన గీతాలు అలరించాయి. తమ ఉద్యమాలకు అండగా నిలిచినందుకు అంగన్వాడీ, ఆశా యూనియన్ నాయకులు కె. ఎస్. లక్ష్మణరావు ను ఈ సందర్భంగా అభినందించారు.

➡️