COP-28: అంతానికి ఆరంభం

Dec 14,2023 08:06 #COP Summit, #Cop-28
cop 28 neglect climate change agreement

శిలాజ ఇంధనాల వినియోగంపై తీర్మానం
ముగిసిన సదస్సు

న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దుబాయ్ లో ప్రతిష్టాత్మకంగా జరిగిన వాతావరణ సదస్సు (కాప్‌-28) బుధవారం ముగిసింది. వాస్తవానికి మంగళవారమే సదస్సు ముగియాల్సిఉన్నప్పటికీ కొన్ని అంశాలపై వ్యక్తమైన భిన్నాభిప్రాయల నేపథ్యంలో బుధవారం నాడు కూడా కొనసాగింది. సదస్సు ముగింపు సందర్భంగా ‘అంతానికి ఆరంభం’ (బిగినింగ్‌ ఆఫ్‌ ది ఎండ్‌) పేరిట శిలాజ ఇంధనాల వినియోగంపై ఒక తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘దుబాయ్ ఏకాభిప్రాయం’ పేరుతో ఈ తీర్మానాన్ని విడుదల చేశారు. ప్యారిస్‌ ఒప్పంద పురోగతి భాగస్వామ్య (గ్లోబల్‌ స్టాక్‌టేక్‌) లక్ష్యాల్లో భాగంగా ఈ తీర్మానాన్ని చేశారు. న్యాయమైన, సక్రమమైన, సమానమైన రీతిలో శిలాజ ఇంధన వినియోగం నుండి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మారాలని 196 పేరాగ్రాఫ్‌లతో 21పేజీల్లో ఉన్న ఈ తీర్మానం ప్రపంచ దేశాలను కోరింది. తొలుత ఈ తీర్మానం ఆమోదించే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. బొగ్గు వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంను సైతం క్రమేణా తగ్గించుకుంటూ శిలాజ ఇంధనాల వినియోగాన్ని 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావలన్న ప్రతిపాదనను నూతన పారిశ్రామిక దేశాలుగా రూపొందుతున్న బ్రెజిల్‌, సౌత్‌ ఆఫ్రికా, ఇండియా, చైనా (బేసిక్‌ దేశాలు)లతో పాటు, లైక్‌ మైండెడ్‌ గ్రూపు ఆఫ్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌ (ఎల్‌ఎండిసి) తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో తక్షణమే నిలిపివేయడం వంటి పదాలను తొలగించారు. బాషను కూడా కొంత సరళీకరించారు.ఈ చర్య పట్ల ధనిక దేశాలు అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ తీర్మానానికి ఆమోదం తెలిపాయి. తీర్మానంపై చర్చల సందర్భంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వ్యవస్థకు మారడానికి తమకు సాంకేతిక సాయంతోపాటు, ప్రత్యేకంగా ఆర్థిక సాయాన్ని అందించాలంటూ పేద దేశాలు చేసిన విజ్ఞప్తిని అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలు తిరస్కరించాయి. ఆప్రికన్‌ దేశాలు ఈ తరహా సాయం కోసం పట్టుబట్టాయి. కాప్‌ సదస్సు నుండి ఆఫ్ఘనిస్తాన్‌ బహిష్కరణఐక్యరాజ్య సమితి నిర్వహించే వాతావరణ చర్చల నుండి వరుసగా మూడో ఏడాది కూడా ఆఫ్ఘనిస్తాన్‌ బహిష్కరణకు గురైంది. ఒకపక్క ఆఫ్ఘనిస్తాన్‌ తీవ్రమైన వరదలు, కరువులతో అల్లాడుతోంది. డజన్ల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇందుకు వాతావరణ మార్పులు ప్రధాన కారణంగా వున్నాయి. ఇటువంటి సమయంలో కాప్‌ సదస్సుకు ఆ దేశం హాజరు కాలేకపోవడంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. 2021లో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఇటువంటి చర్చల నుండి ఆఫ్ఘనిస్తాన్‌ను దూరం పెడుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శనలువాతావరణ మార్పులపై అమెరికా అనుసరిస్తున్న రెండు నాల్కల ధోరణికి నిరసనగా పెద్ద సంఖ్యలో పర్యావరణ కార్యకర్తలు వాతావరణ సదస్సు నిర్వహిస్తున్న వేదికకు సమీపంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పెట్రోలియంను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉందని, ఈ ఉత్పత్తులను నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️