ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

– వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి ప్రజాశక్తి – కడప సాధారణ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వైఎస్‌ఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌ విసి హాలులో ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ తోకలిసి విజరురామరాజు విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంభందించి పోలింగ్‌ సిబ్బంది సిద్ధంగా ఉందన్నారు. ఈ ఎన్నికలో ఇవిఎం, వివి ప్యాడ్స్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతవరంలో పారదర్శకంగా నిర్వహించడానికి ఎంసిసి, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌, స్టాటిక్‌ సర్వేలన్స్‌, వీడియో సర్వేలన్స్‌, వీడియో వ్యూయింగ్‌, అకౌంటింగ్‌, ఎంసిఎంసి బందాలను సెక్టోరల్‌ అధికారులను నియమించామన్నారు. జిల్లాలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉందని, ఈ ఎన్నికలలో ఆర్హత ఉన్న ప్రతి ఓటరును భాగస్వామ్యాన్ని చేయడానికి అన్ని సదుపాయాలను కల్పించామన్నారు. ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులు, తమ నామినేషన్‌ పత్రాలను 18 నుండి 25వ తేదీవరకు ప్రభుత్వ సెలవు దినములలో మినహా ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరుకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారుల వద్ద దాఖలు చేసుకోవాలన్నారు. ఎంపీకి పోటి చేసే జనరల్‌ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లిం చాలన్నారు. ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున జిల్లా సరిహద్దుల్లోని అన్ని చెక్‌ పోస్టులతో పాటు గట్టి భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి వాహనాన్ని తనికీ చేసి అక్రమ నగదు, వస్తు రవాణా జరగకుండా కట్టుదిట్టం చేయడమై నదన్నారు. ఎవరైనా అధిక మొత్తంలో నగదు, బంగారు నగలు, వస్త్రాలు తదితర వస్తువుల కొనుగోలుకు సంబందించిన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకుని ప్రయాణించాల్సి వుంటుందన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు, వెబ్‌ కాస్టింగ్‌, అదనపు బలగాలు, వీలయితే ప్రత్యేక ఫోర్సును ఉపయోగిస్తామన్నారు. కంట్రోల్‌ రూములు 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. మోడల్‌ కోడ్‌ అమలులో ఉండటం వల్ల జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలన్నారు.

➡️