బౌద్ధ, జైన, సిక్కు మతాల్లోకిి మారాలన్నామా అనుమతి తప్పనిసరి

  • గుజరాత్‌ ప్రభుత్వ హుకుం

న్యూఢిల్లీ : హిందూమతం నుంచి ఎవరైనా బౌద్ధ, జైన, సిక్కు మతాల్లోకి మారాలనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. గుజరాత్‌ హోం శాఖ చడీచప్పుడు లేకుండా ఇందుకు సంబంధించిన ఒక సర్క్యులర్‌ను ఇటీవల జారీ చేసింది. ముందస్తు అనుమతి కోరుతూ దరఖాస్తులు అందినప్పుడు సంబంధిత కార్యాలయాలు రాజ్యాంగంలోని 25(2) అధికరణ కింద సిక్కు, జైన, బౌద్ధ మతాలు హిందూమతంలోనే చేర్చబడినందున అటువంటి మత మార్పిడికి ముందస్తు అనుమతి అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని, ఇక నుండి అలా కుదరదని ఆ సర్క్యులర్‌లో ప్రభుత్వం పేర్కొంది. మత మార్పిడికి అనుమతించేటప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆ సర్క్యులర్‌ పేర్కొంది. హిందూ మతంలో కుల వివక్షకు వ్యతిరేకంగా దసరా వంటి పండగల సందర్భంలో దళితులు బౌద్ధమతంలోకి మూకుమ్మడిగా మారడం ఈ రాష్ట్రంలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో బౌద్ధంలోకి మారినవారు ఉన్నారు. ‘హిందువుగా పుట్టినందుకు గర్వించు, హిందువుగానే జీవించు’ అన్న ఫాసిస్టు ఆరెస్సెస్‌ నినాదానికి భిన్నంగా జరుగుతున్న ఈ పరిణామాలను బిజెపి ప్రభుత్వం అడ్డుకోవాలనుకుంది. అంతే ఆగమేఘాల మీద సర్కులర్‌ జారీ చేసింది.. హిందూమతం నుంచి బౌద్దమతానికి మారేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించే సమయంలో కొంతమంది జిల్లా మేజిస్ట్రేట్‌లు చట్టానికి, ఆ నిబంధనలకు తప్పుగా భాష్యం చెబుతున్నారని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. గుజరాత్‌ బౌద్ధ అకాడమీ కార్యదర్శి రమేష్‌ బంకర్‌ మాట్లాడుతూ, బౌద్దమతమనేది ప్రత్యేక మతమని, దీనికి హిందూమతంతో సంబంధం లేదని ఈ సర్క్యులర్‌ స్పష్టం చేసిందన్నారు.

➡️