ఉద్యోగ భద్రత ఏదీ?

contract out sourcing employees protest in vzm
  • కదం తొక్కిన సమగ్ర శిక్షా ఉద్యోగులు
  • కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు

ప్రజాశక్తి – యంత్రాంగం : తమను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే గ్రాస్‌ పే అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ఆందోళనలో ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా పరిధిలో మండల విద్యాశాఖా కార్యాలయాల్లో పనిచేస్తున్న సిఆర్‌ఎంటిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లు, మండల లెవెల్‌ అకౌంటెంట్లు, మెసెంజర్లు, సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్లు, భవిత, ఫిజియో థెరపిస్టులు, పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్‌, క్రాప్ట్‌, పిఇటి పార్ట్‌ టైం టీచర్లను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అందరికీ మినియం ఆఫ్‌ టైం స్కేల్‌ అమలు చేసి, వేతనాలు పెంచాలని కోరారు. విశాఖ పరిధిలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌ వద్ద, అల్లూరి జిల్లాలో పాడేరు ఐటిడిఎ ఎదుట ఆవేదన దీక్ష నిర్వహించారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దీక్షనుద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు పి.మణి మాట్లాడారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని కాంట్రాక్టులోకి మార్చి మినిమం ఆఫ్‌ టైం స్కేల్‌ అమలు చేసి వేతనాల పెంచాలని, ప్రస్తుతం ఉన్న పార్ట్‌ టైం విధానాన్ని రద్దుచేసి, ఫుల్‌ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని, రూ.10 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ గ్రాడ్యూటీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నానుద్ధేశించి సమగ్ర శిక్షా ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పిఇటి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంలో కూడిన మెడికల్‌ లీవులు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట దీక్ష నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగ సంఘాల నాయకులు పోలినాయుడు, ఈశ్వరరావు, దివాకర్‌, లక్ష్మణరావు, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి జిల్లా కన్వీనర్‌ బివి రమణ తదితరులు మాట్లాడారు. విద్యాశాఖలో విశిష్ట సేవలు అందిస్తున్న సర్వ శిక్షా అభియాన్‌ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️