Contaminated Alcohol : 21 కి చేరిన మృతుల సంఖ్య

పంజాబ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలో కలుషిత మద్యం తాగి మరణించినవారి సంఖ్య శనివారానికి 21 కి చేరింది. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బఅందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది.

సంగ్రూర్‌ చీఫ్‌ మెడికల్‌ అధికారి మాట్లాడుతూ …. ఇథనాల్‌ కలిపిన నకిలీ మద్యం తాగా ఇప్పటివరకు 40 మంది ఆస్పత్రిలో చేరారని తెలిపారు. గత బుధవారం నలుగురు నకిలీ మద్యం తాగి మరణించారని, చాలామంది ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. మరుసటి రోజు పాటియాలోని రాజింద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారని అన్నారు. శుక్రవారం మరో 8 మంది మరణించారని వెల్లడించారు. ఈరోజు ఐదుగురు చనిపోయారని చెప్పారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21కి చేరిందని వివరించారు.

ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్‌…
ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఓ ఇంట్లో విషపూరితమైన మద్యం తయారుచేస్తున్నట్లు పట్టుబడిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఆ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, దోషులను విడిచిపెట్టబోమని డీఐజీ హర్చరణ్‌ సింగ్‌ భుల్లర్‌ శుక్రవారం స్పష్టం చేశారు.

➡️