విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తు జరపండి

  •  డిప్యూటీ సిఎం ఇంటి ముందు విద్యార్థుల బైఠాయింపు

ప్రజాశక్తి – సాలూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ డిప్యూటీ సిఎం, రాష్ట్ర గిరిజన మంత్రి రాజన్నదొర ఇంటి ముందు విద్యార్థులు బైఠాయించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నగరంలోని బోసుబొమ్మ జంక్షన్‌ నుంచి మెయిన్‌రోడ్‌ మీదుగా మంత్రి ఇంటి వరకూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.రాజు, కార్యదర్శి డి.పండు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వార్డెన్లను సస్పెన్షన్‌ చేయడం అన్యాయమన్నారు. మరణించిన విద్యార్థులకు చెందిన కుటుంబసభ్యులకు ఐటిడిఎలో ఉద్యోగం, పది లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో మంజూరైన గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను వెంటనే ప్రారంభించాలని కోరారు. అనంతరం రాజన్నదొర పిఎకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.గంగారాం, అఖిల్‌, సహాయ కార్యదర్శి సిహెచ్‌.సింహాచలం, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️