22న సెలవు కోసం సిజెఐకి బిసిఐ ఛైర్మన్‌ లేఖపై ఐలు ఆందోళన

Jan 19,2024 11:17 #Bar Council of India

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ట సందర్భంగా జనవరి 22న సుప్రీంకోర్టుకు సెలవు ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బిసిఐ) ఛైర్మన్‌ లేఖ రాయడంపై అఖిల భారత లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ఐలు అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, పివి సురేంద్రనాథ్‌ ప్రకటన విడుదల చేశారు. ‘రామ మందిరం, అయోధ్య లేదా మరేదైనా ఆలయాన్ని ‘ప్రతిష్ట చేయడం’ అనేది కేవలం మతపరమైన కార్యమే తప్ప ప్రభుత్వ విధి కాదు. అయితే ప్రస్తుతం కార్యనిర్వాహక పాలన అలా కనిపిస్తుంది. ఇది మతపరమైన పండగ కూడా కాదు. దేశంలో మతపరమైన పూలరైజేషన్‌ మరింత పదును పెట్టడానికి, తీవ్రతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఇది మతవాదుల చేతిలో ఒక సాధనంగా మారింది. బాబ్రీ మసీదును అక్రమంగా విధ్వంసం చేసి కూల్చివేయడంతో మతవాదులు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మతపరమైన, మతపరమైన పూలరైజేషన్‌ తీవ్రతరం చేయడానికి న్యాయ వ్యవస్థను మరొక సాధనంగా మార్చకూడదు. కార్యనిర్వాహక పాలన ముందు అది ఒక పార్టీకి లొంగిపోకూడదు. భారతదేశం లౌకిక దేశం. దానికి మతం లేదు. రాజకీయ హిందూ జాతీయ వాదాన్ని భారతీయ జాతీయ వాదంగా ప్రదర్శించడానికి, మతాన్ని రాజకీయం చేయడం, మత పోలరైజేషన్‌ తప్ప దీనికి మతపరమైన, సాంస్కృతిక, జాతీయ లేదా అంతర్జాతీయ ప్రాముఖ్యత లేదు’ అని పేర్కొన్నారు. ‘నిజమైన హిందూ విశ్వాసం ఉన్న మెజారిటీ ప్రజలు ఈ సంఘటనను దేశ రాజకీయ, నైతిక విలువలపై మరో గాయంగా భావిస్తారు. ఆలయ ప్రారంభోత్సవం, ప్రతిష్టాపనకు సంబంధించి సెలవులు మంజూరు చేయడం దేశ పౌరులకు పూర్తిగా తప్పుడు సంకేతాన్ని మాత్రమే ఇస్తుంది. ఇది సిజెఐ అధికారం పరిధికి మించినది’ అని తెలిపారు.’బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ విధమైన మతపరమైన అజెండాలో పాల్గొనకూడదు. లౌకిక రాజ్యాంగ నైతికతను పరిరక్షించడం విధి. బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఈ అత్యంత అభ్యంతరకర చర్యకు వ్యతిరేకంగా మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇది బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఏకపక్ష చర్య. ఇది దేశంలోని మెజారిటీ న్యాయవాదుల ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది. అది వారి ఇష్టానికి విరుద్ధం’ అని పేర్కొన్నారు.యెమెన్‌పై బాంబు దాడికి అమెరికా సమర్థనలు దయనీయం: లావ్రోవ్‌మాస్కో: యెమెన్‌పై బాంబుదాడులకు దిగిన అమెరికా, దాని మిత్రదేశాలు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించాయని రష్యా విమర్శించింది. రష్యన్‌ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ గురువారం నాడిక్కడ మాట్లాడుతూ, యెమెన్‌పై బాంబు దాడిని సమర్థించుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రకటనలు చాలా దయనీయంగా ఉన్నాయని అన్నారు. యెమెన్‌పై దాడి చేసే అధికారం అమెరికా, బ్రిటన్‌లకు ఎవరిచ్చారు అని ఆయన ప్రశ్నించారు. 2011లో లిబియాపై కూడా నాటో ఇలాగే ఏకపక్షంగా దాడి చేసి, ఆ దేశ అద్యక్షుడు కల్నల్‌ గడాఫీని చంపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికా చెప్పే నిబంధనల ఆధారిత ప్రపంచ వ్యవస్థ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. యెమెన్‌పై దాడి చేయడం ద్వారా అమెరికా, దాని మిత్ర దేశాలు అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించాయన్నది స్పష్టం. దీనిని కప్పిపుచ్చుకోడానికి యెమెన్‌ హౌతీ తిరుగుబాటు దారులు వాణిజ్య నౌకలపై దాడులను కుంటి సాకుగా చూపుతున్నాయని, భద్రతా మండలిలో తీర్మానం కూడా ఇందులో భాగమేనని లావ్రోవ్‌ అన్నారు. అమెరికా, బ్రిటన్‌లకు హౌతీల కన్నా యెమెన్‌ను నాశనం చేయాలన్న దానిపైనే ఎక్కువ ఉబలాటమని ఆయన అన్నారు. యెమెన్‌పై దాడిని తాము ఖండిస్తున్నామని రష్యా విదేశాంగ మత్రి చెప్పారు. ఇదిలా వుండగా అమెరికన్‌ సెంట్రల్‌ కమాండ్‌ బుధవారం యెమెన్‌పై పెద్దయెత్తున వైమానిక దాడులు జరిపింది. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ పరిణామాలపై ఐరాస భద్రతా మండలిలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే చర్చలో లావ్రోవ్‌ స్వయంగా పాల్గొననున్నారు.

➡️