పుట్టపర్తిలో పోటాపోటీగా ప్రచారాలు

           పుట్టపర్తి అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా టిడిపి, వైసిపి నాయకులు పోటాపోటీగా ప్రచారాల్లో నిమగమయ్యారు. టిడిపి తరఫున మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డి పోటీలో ఉన్నారు. ఆమెతోపాటు మామ పల్లె రఘునాథరెడ్డి, భర్త వెంకట కృష్ణకిషోర్‌ రెడ్డిలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. టిడిపికి జనసేన, బిజెపి మద్దతు ఉండడంతో ఆ పార్టీ నేతలు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన భార్య దుద్దుకుంట అపర్ణ రెడ్డి, తనయుడు కిషన్‌రెడ్డిలు ప్రచారాలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు వారు ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్‌ తరపున ఎన్నికల బరిలో నిలిచిన దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి కూడా ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలను కలిసి వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుదాం అనేలా అందరినీ కలిసి ముందుకెళ్తున్నారు. ప్రచారాల సందర్భంగా టిడిపి, వైసిపి పార్టీల్లోకి వలసలు జోరందుకున్నాయి. రెండు పార్టీల్లో అటునుంచిఇటు, ఇటునుంచిఅటుకు నాయకులు మారిపోతున్నారు. పార్టీల్లో చేరుతున్న వారందరికీ ఇరు పార్టీల నాయకులు కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. ప్రచారాలు, బహిరంగ సభలకు భారీగానే ప్రజలు హాజరవుతున్నారు. నామినేషన్ల దాఖల తరువాత ఈ ప్రచారాలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది.

➡️