ఫిబ్రవరిలోనూ పోటాపోటీనే..!

Feb 5,2024 10:56 #cinema

సాధారణంగా సంక్రాంతి, దసరా, ఉగాదికి పండుగల సమయాల్లో విడుదలకు పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ ఉండటం సహజం. కానీ ఈ మధ్య ఎక్కువ సినిమాలు వస్తుండటంతో ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాల మధ్యన కూడా పోటీ మొదలైంది. ఏ బడ్జెట్‌లో సినిమాలు తీసినా విడుదలకు క్యూలో ఉంటుండటంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండళ్లకు తేదీలను ఖరారు చేయటంతోపాటుగా వివాదాలను పరిష్కరించటం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. సంక్రాంతి బరిలో సినిమాలకు ఇలాంటి పోటీనే రాగా, తాజాగా ఈనెల తొమ్మిదో తేదీన విడుదలయ్యే సినిమాల మధ్య కూడా పోటీ నెలకొంది. వేరే సినిమాల కోసం తాము వాయిదాలు వేసుకుంటూ పోతే వాణిజ్యపరంగా నష్టపోతామంటూ నిర్మాతలు, దర్శకులు, హీరోలు సైతం బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

                    సంక్రాంతి పండుక్కే ‘బరి’లో నిలవాల్సిన సినిమాల్లో కొన్నింటిని థియేటర్లు లేనికారణంగా ఫిబ్రవరికి విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పట్లో ఈగల్‌, డిజె టిల్లు స్క్వేర్‌, ఊరు పేరు బైరవకోన వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. వీటితోపాటుగా తెరపైకి వచ్చి పోటీలో గుంటూరు కారం, సైంధవ్‌, నా సామిరంగా, హను-మాన్‌ విడుదలయ్యాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్య మండలి, సినీ నిర్మాతల మండలిలు చేసిన కృషి ఫలితంగా ‘ఈగల్‌’ సినిమా ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా పడింది. సంక్రాంతికి అనుకున్నా తన సొంత సినిమా ‘ఫ్యామిలీస్టార్‌’ను ముందుగానే దిల్‌రాజు ఏప్రిల్‌ 5కు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. హీరోగా విజరు దేవరకొండ, హీరోయిన్‌గా మృణాల్‌ఠాకూర్‌ నటస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలోనూ మరోసారి ‘ఈగల్‌’కు పోటీ రావటంతో విడుదల కోసం మరోసారి ఫిలిం ఛాంబర్‌ను ఆ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే అద ేరోజున ‘ఊరు భైరవకోన’, ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలు విడుదల చేస్తామంటూ ఆయా చిత్రాల నిర్మాతలు కూడా ప్రకటించటంతో మళ్లీ తెలుగు చిత్రవాణిజ్య మండళ్లు జోక్యం చేసుకోవాల్సివచ్చింది. తమకిచ్చిన ‘సోలో రిలీజ్‌ డేట్‌’ మాటను నిలబెట్టుకోవాలని ఛాంబర్‌ను సదరు నిర్మాణ సంస్థ కోరింది.

ఇదిలావుండగా తాను నటించిన ‘ఊరు భైరవకోన’ సినిమా విడుదల తేదీని మార్చేది లేదని నటుడు సందీప్‌కిషన్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. తమ సినిమా కూడా అదేరోజు విడుదల చేసేస్తామని ప్రకటించారు. అయితే నిర్మాతల మండలి కోరిక మేరకు 16వ తేదీకి వాయిదా పడినట్లు సమాచారం. ‘ఈగల్‌’ సినిమా కూడా అదే రోజున విడుదలవుతుందనేది తెలియదనీ, తాము కూడా మొదట్లో సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నామనీ, చాలా సినిమాలు ఉండటం చూసి ఫిబ్రవరికి వెళ్లామని చెప్పుకొచ్చారు. పెద్దల జోక్యంతో హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘డిజె టిల్లు స్క్వేర్‌’ను చిత్రాన్ని మార్చి 29న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

డిజె టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సినిమాల్లో మొదటిస్థానంలో హను-మాన్‌ నిలవగా, రెండోస్థానంలో నా సామిరంగ సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు కారం, సైంధవ్‌ ఆడాయి. రాజ్‌తరుణ్‌ హీరోగా, హీరోయిన్‌గా మాల్వి మల్హోత్ర నటిస్తూ ఎఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తిరగబడర సామీ’ ఈనెల 23న విడుదల కానుంది. సోహెల్‌ టైటిల్‌రోల్‌లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్‌ ఫిలిమ్స్‌ అండ్‌ కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండి పాషా నిర్మించిన చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు ఈనెల రెండోతేదీన విడుదలైంది. యష్‌ పూరి హీరోగా, అపూర్వ రావ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ కూడా అదేరోజు విడుదలైంది. హమ్స్‌ టెక్‌ ఫిలింస్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్‌కుమార్‌, సంజరురెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మాతలు. కౌశిక్‌ భీమిడి దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు ఓ మోస్తరుగా ఆడుతూనే ఉన్నాయి. కోలీవుడ్‌లో వడకుప్పట్టి రామస్వామి, డెవిల్‌, మరక్కుమా నెంజం, చిక్లెట్స్‌్‌ సినిమాలు కూడా ఈనెల రెండోతేదీన ఒకేరోజు పోటీగా విడుదలయ్యాయి.

➡️