చీరాల్లో మత ఉద్రిక్తత

Jan 17,2024 00:40

– క్రీస్తును దుర్బాషలాడిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్‌
– ఈపురిపాలెం వద్ద జాతీయ రహదారిపై బైఠాయింపు
ప్రజాశక్తి – చీరాల
క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రీస్తు పుట్టుక, బైబిల్‌లోని అంశాలపై దుర్భాషలాడుతూ మండలంలోని గవినివారిపాలెంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న క్రైస్తవులపై హల్ చల్ చేస్తూ వీరంగం సృష్టించిన యువకులను అరెస్టు చేయాలని కోరుతూ ఈపూరుపాలెం వద్ద జాతీయ రహదారిపై క్రైస్తవులు మంగళవారం బైఠాయించారు. ఘటనపై ఏపీ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ పట్టేమ్ డేవిడ్ మనోహర్, తోటవారిపాలెం నివాసి మార్పు దీనరాజు ఘటనకు కారకులైన యువకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బైబిల్, క్రీస్తు తల్లి మరియమ్మ, క్రీస్తు పుట్టుక గురించి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా క్రైస్తవుల మనో భావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన యువకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి యుతంగా గ్రామంలో సువార్త ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగటం విచారకరమని పలువురు పాస్టర్లు అన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో చీకటి శక్తులు చీరాల ప్రాంతంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. పోలీసులు పూర్తి విచారణ చేసి నింధితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడంతో ఈపురపాలెం జాతీయ రహదారిపై క్రైస్తవులు, పాస్టర్లు, దళిత సంఘ నాయకులు రాస్తారోక చేశారు. ప్రశాంతంగా ఉండే చీరాల వంటి ప్రాంతాల్లో కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే అల్లరి మూకలను అరెస్టు చేసేవరకు నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అల్లరిమూక అరెస్టుకు సిఐలు నిమ్మగడ్డ సత్యనారాయణ, శేషగిరిరావు, సోమశేఖర్, ఈపురపాలెం ఎస్సై జనార్ధన్ బుధవారం మధ్యాహ్నం వరకు సమయాన్ని కోరడంతో క్రైస్తవులు నిరసనను తాత్కాలికంగా విరమించారు. కార్యక్రమంలో పాస్టర్లు, ప్రజా వేదిక అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం, దళిత నాయకులు కంచర్ల చిట్టిబాబు, రత్న ప్రకాష్, డేటా దివాకర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️