చైతన్య విద్యార్థిని ఆత్మహత్య కేసులో కళాశాల ల్యాబ్‌ టెక్నీషియన్‌తోపాటు మరికొందరు అరెస్ట్‌

Apr 2,2024 22:13 #student suicide, #Visakha

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :లైంగిక వేధింపుల కారణంగా గత నెల 28న కొమ్మాది చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న 17 ఏళ్ల డిప్లొమో విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితునితోపాటు కళాశాలకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను విశాఖ డిసిపి 1 (లా అండ్‌ ఆర్డర్‌) మణికంఠ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… తన కూతురు కనిపించడంలేదని అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఎం.పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసి పుటేజీలను పరిశీలించారు. సదరు విద్యార్థిని ఆ రోజు అర్ధరాత్రి 12:48 గంటలకు కాలేజీ హాస్టల్‌ మేడపైకి వెళ్లింది. అక్కడ నుండి ఆమె తండ్రికి, అక్కకు వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు పంపింది. అనంతరం హస్టల్‌ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సుమారు 250 మంది కళాశాల విద్యార్థులను పోలీసులు వేర్వేరుగా విచారించారు. కెమిస్ట్రీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ శంకరరావును ప్రధాన నిందితునిగా గుర్తించారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. శంకరరావు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు విచారణలో తేలింది. ఆయనతోపాటు హాస్టల్‌ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన, నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్‌ను నిర్వహిస్తున్నందున హాస్టల్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు శంకర్‌ వర్మ, డిప్లమో కాలేజీ ప్రిన్సిపల్‌ గుల్లిపల్లి భాను ప్రవీణ్‌, హాస్టల్‌ వార్డెన్‌ వంటపతి ఉషారాణి, వార్డెన్‌ భర్త వంటపతి ప్రదీప్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. మృతురాలి ఫోన్‌తోపాటు నిందితులందరి సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీకి పంపించారు. విచారణలో భాగంగా కాలేజీ యాజమాన్యం పనితీరుపై పలు విమర్శలు వచ్చాయని, కాలేజీలో ర్యాగింగ్‌ కూడా జరుగుతున్నట్టు గుర్తించామని డిసిపి మణికంఠ తెలిపారు. పిఎం.పాలెం సిఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, మరిన్ని వివరాలను విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు.

➡️