డిఎస్‌సి అభ్యర్థుల కలెక్టరేట్‌ ముట్టడి

Dec 28,2023 21:41 #dsc, #students dharna

-డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేత

ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్‌ :రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే మెగా డిఎస్‌సి విడుదల చేయాలని గురువారం డివైఎఫ్‌ఐ, డిఎస్‌సి నిరుద్యోగ అభ్యర్థులు కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే డిఎస్‌సి విడుదల చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి గుణపాఠం చెబుతామంటూ నినాదాలు చేశారు. ముందుగా బిర్లా గేట్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న హాజరై మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగన్‌మోహన్‌ రెడ్డి ‘నేను ఉన్నాను.. నేను విన్నాను… వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేస్తాను, ప్రతేడాది జనవరికి జాబ్‌ కాలెండర్‌ విడుదల చేస్తాను’ అని హామీ ఇచ్చారన్నారు. 2018 డిఎస్‌సి తర్వాత ఇప్పటివరకు ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పేరుతో పనులు చేసి భారీగా విద్యార్థుల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకునే సిఎంకి ఆ విద్యార్థులకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచన లేకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పార్లమెంటులో కేంద్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటిస్తే మంత్రి బత్స సత్యనారాయణ ఒకరోజు 714, మరో రోజు 8 వేలు, ఒకరోజు 69 అని నోటికి వచ్చిన సంఖ్య చెబుతున్నారని తెలిపారు. మెగా డిఎస్‌సి విడుదల చేయకపోతే జనవరిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు సీమ కృష్ణ, నిరుద్యోగి మల్లిక, పిఇటిల సంఘం నాయకులు దేవేంద్ర మాట్లాడారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన డిఆర్‌ఒ మధుసూదన్‌ రావుకి డివైఎఫ్‌ఐ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఆయన ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీఇచ్చారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా సహాయ కార్యదర్శులు హుస్సేన్‌ బాష, మైనా, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

➡️