ఎపికి చల్లని కబురు – రెండురోజులపాటు తేలికపాటి వానలు

Feb 24,2024 13:56 #andhrapradesh, #Light rains, #two days

అమరావతి : ఎపికి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల అవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉంది. దక్షిణ తెలంగాణ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. ఒక ద్రోణి దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

శని, ఆదివారాల్లో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని జిల్లాల్లో మంచు ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అలాగే పగటిపూట ఎండ ఉక్కపోత ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా రెండు రోజుల పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

➡️