నేడు మధ్యాహ్నం 3 గంటలకు కోడ్‌

Mar 16,2024 09:02 #Election Commission

– ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు

– అన్నిచోట్లా హోర్డింగులు, పొస్టర్లు, జెండాల తొలగింపు

– సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా మెమో జారీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నేడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును మధ్యాహ్నం మూడు గంటలకు ప్రకటించనుందని, వెంటనే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) అమల్లోకి రానుందని సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా మెమో జారీ చేశారు. అప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాటిల్లో పేర్కొన్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోపు ప్రభుత్వ ఆస్తులపై 48 గంటల్లో ప్రైవేటు ఆస్తులు, బస్సులు, రైల్వేస్థలాలు, బస్టాండుల్లో ఉన్న పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు తొలగించాలని సూచించారు. అన్ని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ప్రభుత్వ ఖజనా నుండి చెల్లింపులు జరిగే ప్రకటనలనూ నిలిపేయాలని కోరారు. అధికారిక వెబ్‌సైట్లలో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలనూ తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కొనసాగుతున్న పనులు, అనుమతి పొంది ప్రారంభించని పనుల వివరాలనూ సిఇఒ, డిఇఒలకు సమర్పించాలని సూచించారు. మంత్రులెవరూ ప్రభుత్వ వాహనాలను వాడకూడదని, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అన్ని బదిలీలూ నిలిపేయాలని సూచించారు. ప్రభుత్వ భవనాల మీద ప్రధాని, సిఎం, ఇతర మంత్రుల ఫొటోలూ ఉండకూదని తెలిపారు. వీడియోకాన్ఫరెన్సులను పూర్తిగా నిషేధించారు. లబ్ధిదారులు పొందే కార్డులపైనా, శిలాఫలకాలపైనా ఎవరి బమ్మలూ ఉండకూడదని పేర్కొన్నారు. కరెంటు, నీటి, ఆస్తిపన్నుల బిల్లులపై రాజకీయ పార్టీ నాయకుల ఫొటోలు గానీ, గుర్తులుగానీ ఉంచకూడదని ఆదేశించారు. ఎన్నికల సమయంలో మంత్రులు ఎవరూ ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండకూడదని తెలిపారు. అధికారుల్లో భార్యాభర్తలు ఎవరైనా ఒకరు ఎన్నికల పనిలో ఉంటే ప్రత్యేక కారణం ఉంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా అధికారిగా ఉన్న భర్త గానీ, భార్య గానీ హెడ్‌క్వార్టర్‌ వీడటానికి వీల్లేదని సూచించారు. ప్రభుత్వ వేతనం పొందుతున్న వ్యక్తి ఎవరైనా రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తే ఐపిసి 171, 123, 129, 134, 134ఎ, ఆర్‌పి యాక్టు 1951 ప్రకారం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️