కష్టకాలంలో… అండగా ఉంటాం : సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి

cm ys jagan visit crop damage

ప్రతి రైతునూ ఆదుకుంటాం

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా, కోట (తిరుపతి జిల్లా) : కష్టకాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మిచౌంగ్‌ తుపాను వల్ల తిరుపతి, బాపట్ల జిల్లాల్లో నష్టపోయిన ప్రాంతాల్లో శుక్రవారం సిఎం పర్యటించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బుద్ధాం, పాతనందాయపాలెంలో, తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం సిఎం పర్యటన సాగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆయన చూశారు. రైతులనుండి నష్ట తీవ్రతను తెలుసుకున్నారు. వారి నుద్దేశించి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప.. ఏ ఒక్కరికీ చెడు జరగదని అన్నారు. తుపాను వల్ల వాటర్‌ లాగింగ్‌ జరిగి అందరూ ఇబ్బందులు పడ్డారన్నారు. నష్టం జరిగిన వారిని గుర్తించి సచివాలయంలో సోషల్‌ ఆడిట్‌కు పేర్లు పెట్టనున్నట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంతకుముందు కరువు, వరదలు వచ్చినా పట్టించుకున్న పరిస్థితులు లేవని తెలిపారు. పంట నష్టానికి సంబంధించి, ఎవరైనా ఇన్‌ పుట్‌ సబ్సిడీ రాదనో, ఇంకొకటి రాదనో చెబితే నమ్మవద్దని రైతులనుద్దేశించి ఆయన అన్నారు.’ఇది మీ బిడ్డ ప్రభుత్వం… ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగదు.’ అని ఆయన అన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నష్టం జరిగితే, మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేలోపే ఇన్సూరెన్స్‌ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి రూ.2,500 ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. వర్షం వల్ల రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు 25 కేజీల రేషన్‌ బియ్యంతోపాటు నిత్యావసరాలను పంపిణీ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఇంటికీ వలంటీర్‌ వచ్చి రూ.2,500 ఇస్తారన్నారు. నష్టపోయిన రైతుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించే పనులు చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి వెంట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.

➡️