మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తా..

Apr 24,2024 20:21

  టిడిపి అభ్యర్థి కళావెంకటరావు

అట్టహాసంగా నామినేషన్‌

ప్రజాశక్తి-చీపురుపల్లి :  తనను చీపురుపల్లి నుంచి గెలిపిస్తే నియోజకవర్గంలో మూత పడి ఉన్న పరిశ్రమలను తెరిపిస్తానని టిడిపి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా కళావెంకటరావు బుధవారం నామినేషన్‌ వేశారు. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తల కేరింతల మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ పత్రాలను స్థానిక రిటర్నింగ్‌ అధికారిని బి.శాంతికి ఆర్‌డిఒ కార్యాలయంలో అందజేశారు. విజయనగరం పార్లమెంటు టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్‌నాయుడు, గద్దే బాబూరావు, కె.త్రిమూర్తులరాజు, నాలుగు మండలాల టిడిపి నాయకలు పాల్గొన్నారు. అనంతరం మూడురోడ్లు కూడలిలో జరిగిన బహిరంగ సభలో విజయనగరం పార్లమెంటు టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి నాగార్జున, గద్దే బాబూరావు, కె త్రిమూర్తులరాజుతో కలసి పాల్గొన్నారు.

మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తా..

ఈ సందర్బంగా కళావెంకటరావు మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గంలో పండిన ధాన్యం పంట ఇక్కడున్న రాజకీయ నాయకుల మిల్లులకే ఇవ్వాలట, తాను గెలిస్తే అలాంటిది ఏమీ లేకుండా ఎవరు పండించిన పంట వారి కోరిక మేరకే మిల్లులకు ఇచ్చుకునే విధంగా చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తానని హామీ ఇచ్చారు. వ్యాపారాలు చేసుకునే వారు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చని అన్నారు. రాబోయే ఐదేళ్లలో చీపురుపల్లిని మీరందరి సహకారంతో సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఎన్నికలలో పార్లమెంటుకు కలిశెట్టి అప్పలనాయుడుకు, మరొక ఓటు ఎంఎల్‌ఏగా పోటీ చేస్తున్న తనకు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన టిడిపి నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, దన్నాన రామంచంద్రుడు, తాడ్డి సన్యాసి నాయుడు, సారిపాక సురేష్‌, తిరుమలరాజు కిరణ్‌రాజు, రెడ్డి గోవిందనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️