వాతావరణ మార్పులు వణికిస్తున్నాయి

Climate change is alarming

దేశమంతటా ప్రభావం
పెరుగుతున్న నష్టం

న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు దేశాన్ని వణికిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం కొన్ని ప్రాంతాలకే వీటి ప్రభావం పరిమితం కాగా, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఏదో రూపంలో వాతావరణ మార్పుల ప్రభావం దేశమంతటా పడుతోంది. నష్టతీవ్రత కూడా గణనీయంగా పెరుగు తోంది. ఈ సంవత్సరానికి సంబంధించిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సిఎస్‌ఇ) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమౌతోంది. తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా చోటుచేసుకుంటున్న ఆస్తి, ప్రాణ నష్టాలు ఏటికేడాది పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అనుసరించే విధానాలు కీలకంగా మారనున్నాయి. తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్‌ 30వ తేది వరకు) 273 రోజులకు గాను 235 రోజులు తీవ్రమైన ఘటనలు దేశ వ్యాప్తంగా నమోదై నాయి. గత ఏడాది (2022లో) 15 రాష్ట్రాల్లోనే తీవ్రమైన వాతావరణ ఘట నలు నమోదుకాగా, ఈ ఏడాది 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ తరహా సంఘటనలు విస్తరించాయి. ఫలితంగా ప్రాణనష్టం పెరిగింది. తెలుగు రాష్ట్రాల పైనా వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగానే ఉంది. 2022లో ఈ తరహా ఘటనల కారణంగా దేశ వ్యాప్తంగా2,755 మంది మరణించగా ఈ ఏడాది మృతుల సంఖ్య 2,923కుచేరింది. అధికారిక సమాచారం గత ఏడాది మాదిరేఈ సంవత్సరం కూడా 1.84 మిలియన్‌ హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే, పంట నష్ట తీవ్రత కూడా గత ఏడాదితో పోలిస్తే అధికంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.జనవరి – ఫిబ్రవరి నెలల్లోఈ ఏడాది జనవరి-పిబ్రవరి నెలల్లో 28 రోజులు తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 21 రోజులు తీవ్రమైన చలిగాలులు దేశాన్ని వణికించాయి. పిడుగుపాటు ఘటనలు, భారీ వర్షాల వంటి సంఘటనలు కూడా ఉత్తర భారతంలో చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. జనవరి నెలలో ఎనిమిది సంవత్సరాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజు దక్షిణ భారతంలో నమోదైంది. ఆ రోజున సగటున 30.59 సెల్సియస్‌ ఉష్ణోగ్రత దక్షిణ భారతంలో నమోదైంది. ఈ నెలల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆ రాష్ట్రాల్లో 15 రోజుల్లో తీవ్ర వాతావరణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. మార్చి నుండి మే వరకుమార్చి – మే నెలల మధ్య కూడా అనేక రాష్ట్రాలో వర్షాలు, వరదలు, పిడుగుపాట్ల వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 16 రోజులు భారీ వర్షాలు, వరదలు సంభవించగా, 79 రోజుల్లో పిడుగులు పడ్డాయి. 28 రోజులు దేశ వ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీచాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా 321 మంది మరణించారు. మార్చి నుండి మే నెల వరకు గత ఏడాది 10 వేల హెక్టార్లలో పంట నష్టం చోటుచేసుకోగా, ఈ ఏడాది 6 లక్షల 40 వేల హెక్టార్లలో నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదల ప్రభావం మహారాష్ట్ర, రాజస్తాన్‌లపై తీవ్రంగా పడింది. జూన్‌ నుండి సెప్టంబర్‌ వరకు జూ నుండి సెప్టెంబర్‌ వరకు దేశ వ్యాప్తంగా 122 తీవ్ర వాతావరణ సంఘటనలు నమోదైనాయి. వీటిలో 115 రోజుల్లో భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి బారిన పడి దేశ వ్యాప్తంగా 2,594 మంది మరణించారు. 2022లో ఈ కాలంలో తీవ్ర వాతావరణ సంఘటనల కారణంగా 2,431 మంది మరణించారు. రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, సీజన్‌ ప్రారంభంలోనే వచ్చిన బిపర్‌ జారు తుపాన్‌ పశ్చిమ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. జులై నెలల్లో హిమాచల్‌ ప్రదేశలో అకస్మిక వరదలు చోటుచేసుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో…

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుండి సెప్టెంబర్‌ 30వ తేది వరకు 273 రోజుల్లో 45 తీవ్ర వాతావరణ ఘటనలు చోటుచేసుకోగా తెలంగాణలో వీటి సంఖ్య 52గా నమోదైంది. వీటికారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 45 మంది మరణించగా, తెలంగాణలో 33 మంది మృతి చెందారు. తెలంగాణలో 62,811 హెక్టార్లలో పంట నష్టం సంభవించగా, ఆంధ్రప్రదేశ్‌లో 9015 హెక్టార్ల నష్టం వాటిల్లింది.

2015

మరఠ్వాడాలో తీవ్ర కరువు(ఈ తరహాలు ఉపద్రవాలు రెట్టింపు అయ్యే అవకాశం)

1979-2021

పశ్చిమ తీర ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా పెరిగిన తుపాన్ల ముప్పు(సముద్రాల ఉపరితల వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపించాయి. తూర్పు అరేబియా సముద్రంలో తుపాన్ల తీవ్రత పెరిగింది.)

1995-2023

భూ తాపంలో పెరుగుదల కారణంగా దేశ మంతా వడగాల్పుల తీవ్రత పెరిగింది.(గత 30 సంవత్సరాల్లో వడగాల్పుల రోజులు దేశమంతా సగటున 2.5 రోజులు పెరిగాయి)

2022

గంగా పరివాహక ప్రాంతంలో తుపాన్ల సంఖ్య పెరిగినప్పటికీ, తీవ్రత పెరిగింది. 2050 నాటికి తుపాన్ల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం

2023 జూన్‌-ఆగస్టు

వాతావరణ మార్పుల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో రెండు రెట్లు పెరిగిన వడగాల్పులు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

2041-2080

ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్బ జలాలు క్షీణత మూడు రెట్లు పెరిగే ప్రమాదం.

➡️