అసమ్మతి గళాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల పంజా

Mar 1,2024 07:14 #Editorial

ప్రతిపక్ష నేతలను నిందితులుగా బోనులో నిలబెట్టేందుకు గాను బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధంగా వాడుకుంటోంది. ఎన్నికల వేళ ప్రత్యర్థులను నయానా భయానా దారికి తెచ్చుకునేందుకు మోడీ-అమిత్‌ షా బృందం ప్రయత్నిస్తుంది. ఇది సాధ్యం కాని చోట కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తారు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి కాగానే మొదలైన ఈ ప్రాజెక్ట్‌…ప్రధాని అయ్యాక దేశమంతటికీ వ్యాపించింది. ఇ.డి, సిబిఐ, ఎన్‌ఐఎ, ఐ.టి, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి దర్యాప్తు సంస్థలను ఇందుకోసం దుర్వినియోగం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై కేసులు నాలుగు రెట్లు పెరిగాయి.

హేమంత్‌ సోరెన్‌

                    జార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జెఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ను ఈ జనవరి 31న అరెస్టు చేసి జైలులో ఉంచారు. రాంచీలో ల్యాండ్‌ డీల్‌ ముసుగులో మనీ లాండరింగ్‌ జరిగినట్లు ఆరోపించిన కేసు ఇది. అరెస్టుకు రెండు రోజుల ముందు, ఇ.డి అధికారులు ఢిల్లీలోని సోరెన్‌ నివాసానికి చేరుకుని, ఇంట్లో డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం చేశారు. అయితే చార్జిషీటులో నిందితుడి పేరు కూడా లేదు. పలుమార్లు విచారించినా స్పష్టమైన ఆధారాలు లేని కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అరెస్ట్‌ చేశారు. బిజెపి ని ఓడించి జార్ఖండ్‌లో సోరెన్‌ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వేట మొదలైంది.

అరవింద్‌ కేజ్రీవాల్‌

                       ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను విచారణకు హాజరు కావాలని ఇ.డి ఆరు సార్లు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఇదంతా జరిగింది. మొదటి నోటీసు అక్టోబర్‌ 2023లో జారీ అయింది. కేజ్రీవాల్‌పై ఇ.డి కోర్టును ఆశ్రయించింది. ఇ.డి ఫిర్యాదులో సిఆర్‌పిసి సెక్షన్లు 190 మరియు 200, నల్లధనం నిరోధక చట్టంలోని సెక్షన్‌ 50 గాక దర్యాప్తులో సహకరించకపోవడం వంటివి ఉన్నాయి.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌-ఆయన కుటుంబం

                  బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించారనే ఏకైక కారణంతో మోడీ ప్రభుత్వం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ని, ఆయన కుటుంబాన్ని నిరంతరం వేటాడుతోంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ భూములు తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని కేసు నమోదైంది. జూన్‌ 2023లో, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై, సిబిఐ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. మే 2022లో, దాణా కుంభకోణం కేసులో లాలూ బెయిల్‌పై విడుదలైన వెంటనే, రైల్వే రిక్రూట్‌మెంట్‌ మోసం కేసును సిబిఐ నమోదు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి)కి చెందిన ప్రముఖ నేతలపై సిబిఐ చర్యలు తీసుకోవడం ప్రతిపక్ష పార్టీలపై వేటు వేసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడలో భాగమేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేయడంలో లాలూ ప్రసాద్‌, తేజస్వి ప్రధాన పాత్ర పోషించారు.

ఫరూక్‌ అబ్దుల్లా

              జమ్ము-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాను విచారణకు పిలిచారు. జమ్ము-కాశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకున్నారు. 2022లో ఈ కేసులో ఫరూక్‌ అబ్దుల్లాపై సిబిఐ చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది.

సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక

                   నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, పవన్‌ బన్సాల్‌ లను ప్రశ్నించారు. మోసం, నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం వంటి అభియోగాలు కూడా మోపారు. ఈ కేసులో సోనియా, రాహుల్‌లకు 2015లో బెయిల్‌ మంజూరైంది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి ఇ.డి రూపొందించిన కొత్త చార్జిషీట్‌లో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరు ఉంది. హర్యానా లోని ఫరీదాబాద్‌లో జరిగిన భూముల వ్యవహారంలో ప్రియాంక ప్రమేయం కూడా ఉందని ఇ.డి ఆరోపిస్తోంది.

మనీష్‌ సిసోడియా

                   ఢిల్లీ లిక్కర్‌ పాలసీ అవినీతి కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను సిబిఐ, ఇ.డి అరెస్ట్‌ చేసి జైలుకు పంపి ఫిబ్రవరి 26కి ఏడాది పూర్తయింది. 2023 ఫిబ్రవరి 26న సిబిఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించి ఎనిమిది గంటలపాటు విచారించిన తర్వాత అరెస్టు చేశారు. మద్యం పాలసీకి సంబంధించి సిసోడియాతో పాటు మరో 14 మందిని సిబిఐ నిందితులుగా పేర్కొంది.

డి.కె శివకుమార్‌

               కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్‌ను పన్ను ఎగవేత మరియు హవాలా లావాదేవీలకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో ఇ.డి అరెస్టు చేసింది. బెంగళూరు ప్రత్యేక కోర్టులో 2018లో ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. గుజరాత్‌ లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను శివకుమార్‌ తన రిసార్ట్‌లో ఉంచిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో శివకుమార్‌కు కేంద్ర సంస్థలు ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తూనే ఉన్నాయి.

/’దేశాభిమాని’ సౌజన్యంతో/

➡️