టెస్టులకు క్లాసెన్‌ గుడ్‌బై

Jan 8,2024 21:30

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌, విధ్వంసకర బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు సోమవారం వెల్లడించాడు. కెరీర్‌లో కేవలం నాలుగు టెస్టులాడిన క్లాసెన్‌ సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు అధికారికంగా వెల్లడించింది. ‘నేను తీసుకుంటున్న నిర్ణయం సరైనదా? కాదా? అనే ఆలోచనతో కొన్ని రోజులు నిద్రపట్టలేదు. మొత్తానికి టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాలని డిసైడ్‌ అయ్యా. నాకు ఎంతో ఇష్టమైన ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం చాలా కష్టమైన నిర్ణయమే’ అని 32ఏళ్ల క్లాసెన్‌ తెలిపాడు. 2019లో భారత్‌ పర్యటనలో క్లాసెన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రాంచీ వేదికగా జరిగిన ఆ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేశాడు. ఆ తర్వాత మరో టెస్టు ఆడటానికి నాలుగేళ్ల పాటు ఎదురుచూశాడు. 2023లో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే క్లాసెన్‌ విఫలమయ్యాడు. మొత్తంగా టెస్టుల్లో 105 పరుగులు మాత్రమే చేశాడు. అత్యుత్తమ స్కోరు 35మాత్రమే. దీంతో వికెట్‌ కీపర్‌గా టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. కైల్‌ వెర్రెయిన్‌ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

➡️