సర్కస్‌ .. కనుమరుగవుతున్నసంస్కృతి

Mar 19,2024 06:24 #feachers, #jeevana, #Jeevana Stories

ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాలు, రీల్స్‌, షార్ట్స్‌ల కాలంలో ఉన్నాం. వినోదం అంటే ఇంతకు మించి లేదంటారు చాలామంది పెద్దవాళ్లు, చిన్నవాళ్లు. ఇవేమీ లేని కాలంలో టీవీలు కూడా రాని రోజుల్లో ఎన్నో కళారూపాలు ప్రజలను అలరించాయి. వాటిల్లో సర్కస్‌ ఒకటి. వింతలు, విశేషాలకు అక్కడ కొదవ లేదు. అడవిలో తిరిగే జంతువులను ప్రత్యక్షంగా చూసే అనుభూతి అక్కడ తప్ప మరెక్కడా ఉండదన్నంత థ్రిల్‌ చేసేది. మనుషులు, జంతువులు తాడు మీద నడవడం, మంటల్లో దుమకడం … చూసి, ప్రేక్షకులు నోరెళ్లబెట్టేవారు. చక్కని పలుకుల చిలకమ్మ చక్రాల బండిలో ఎంచక్కా షికారు చేస్తుంటే భలే సరదాగా ఉండేది. భీకర శరీరమున్న ఏనుగు చిన్న సైకిల్‌పై భలే కవాతు చేసేది. అడవికి రారాజు సింహం కూర్చొమంటే కూర్చొనేది. లేవమంటే లేచేది. ఇక కోతి విన్యాసాలు సరేసరి. ఎంత చూసినా తనివి తీరని ఆనందం అక్కడ కనిపించేది. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ పరిస్థితులనే మన కళ్లముందుకు తీసుకొచ్చాడు కర్నాటక విజయపురలో నివసిస్తున్న ‘రాజకమల్‌ సర్కస్‌’ నిర్వాహకుడు రఫిక్‌ షేక్‌. 46 ఏళ్ల రఫిక్‌ షేక్‌కి సర్కస్‌ ఉపాధినిచ్చే మార్గం కాదు.. తరగని సంపద. కళ్లముందు కనుమరుగవుతున్న సంస్కృతి.

‘సర్కస్‌’ … కొన్ని దశాబ్దాలు భారత్‌ని ఉర్రూతలూగించింది. వినోదం కోసం నడిపే ఈ కార్యక్రమాన్ని చిన్నా, పెద్ద వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ వీక్షించేవారు. ఆస్వాదించేవారు. అందులో విజయపురతో పెనవేసుకున్న ‘రాజ్‌కమల్‌ సర్కస్‌’ ఒకటి. రఫిక్‌ తాత నిర్వహణలో మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో నిత్యం లాభాల బాటలో నడిచేది. ‘మా తాత తరువాత ఈ సర్కస్‌ని మా నాన్న కొనసాగించాడు. నా హయాం వచ్చేసరికి ఆదరణ లేదు. దీంతో ఉపాధి కోసం రైల్వే రంగంలోకి వెళ్లాను. ఉద్యోగం చేసుకుంటున్నా ఏదో వెలితి వెంటాడేది. నా కుటుంబాన్ని, నా తరతరాల సంస్కృతిని (సర్కస్‌ని) విడిచిపెట్టాను అన్న బాధ నన్ను స్థిమితంగా ఉండనిచ్చేది కాదు. ఎక్కువకాలం ఉద్యోగం చేయలేకపోయాను. నా మూలాలు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేశాను. కానీ రానురాను వినోదరంగంలో వచ్చిన అనేక మార్పులు మమ్మల్ని రోడ్డున పడేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సర్కస్‌ కంపెనీని చంపేశారు’ అంటూ ఆవేదనగా చెబుతున్నారు రఫిక్‌.
ప్రస్తుతం రాజ్‌ కమల్‌ సర్కస్‌’ కంపెనీలో చిన్నాపెద్దా అంతా కలసి 90 మంది ఉన్నారు. వారంతా ఒకే కుటుంబంలా మెలగుతారు. అక్కడే ఉంటారు. పడుకుంటారు. తింటారు. ‘ఇక్కడ పనిచేస్తున్న వారంతా నా బంధువులుగా భావిస్తాను. ఎప్పుడూ వారిని కార్మికులుగా చూడలేదు. మా బంధం చాలా కాలంగా ఇలాగే ఉంది. నెలల తరబడి కలిసే వుండడం వల్ల ఈ అనుబంధం ఏర్పడింది. పండుగొచ్చినా, పబ్బమొచ్చినా, బాధ వచ్చినా, సంతోషం కలిగినా అందరం కలిసే చేసుకుంటాం’ అని రఫిక్‌ చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో మెరుపు కనిపించింది.


30 ఏళ్ల అనుబంధం
56 ఏళ్ల సురేష్‌ కేరళ నుండి కంపెనీకి వచ్చి 30 ఏళ్లు పైబడింది. ‘సర్కస్‌’ నాకు అన్నీ ఇచ్చింది. నేనెప్పుడూ దీన్ని వదిలిపెట్టాలని అనుకోలేదు. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను’ అంటూ వృత్తి పట్ల ఎంతో అంకితభావంతో చెబుతున్నాడు సురేష్‌.
మణిపూర్‌ వాసి..
మణిపూర్‌కి చెందిన 28 ఏళ్ల నౌబిసన్‌ తౌనాజమ్‌ రెండేళ్ల క్రితమే కంపెనీలో చేరాడు. ‘ఇది సర్కస్‌ మాత్రమే కాదు, ఒక సంస్కృతిని పరిరక్షించడం లాంటిది. తరతరాలుగా దీన్నే జీవనోపాధిగా చేసుకుని ఎన్నో కుటుంబాలు మనుగడ సాగిస్తున్నాయి. అందుకే కంపెనీ అంటే నాకు చాలా గౌరవం’ అంటున్నాడు.
‘సర్కస్‌ అంటే ఓ కంపెనీ మాత్రమే కాదు.. ఇది ఒక ప్రపంచం. బార్బర్లు మొదలుకుని వంటవాళ్లు, మెకానిక్‌లు, దర్జీలు ఇలా ఎంతోమంది దీనిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఎక్కడ ప్రదర్శన ఉంటే అక్కడికి మాతో పాటు వాళ్లు కూడా ప్రయాణిస్తారు. మణిపూర్‌, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ ఇలా దేశవ్యాప్తంగా ఇక్కడ పనిచేసే కార్మికులు ఉన్నారు. సురేష్‌ మా నాన్న కాలం నుండి మాతో పనిచేస్తున్నారు. వీరందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది’ అంటున్నారు రఫిక్‌.

‘మూడు దశాబ్దాల క్రితం మా పరిస్థితి వేరేలా ఉండేది. భారత్‌లో 90 రకాల సర్కస్‌లు ఉండేవి. అన్నీ లాభాల్లోనే ఉండేవి. ఎంతోమంది కళాకారులు దీనిపై ఆధారపడేవారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మాపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. జంతువుల ప్రదర్శనపై నిషేధం విధించారు. మా కార్మికులపై కఠిన ఆంక్షలు అమలుచేశారు. ఫలితంగా మేం చూస్తుండగానే మా భవిష్యత్తు పేక మేడలా కూలిపోయింది’ అంటూ రఫిక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
”’జంతువులను హింస పెడుతున్నామని మాపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. కానీ ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభ కార్యాల్లో గుర్రాలను వాడుతున్నారు. సాంప్రదాయం పేరుతో పశువుల పరుగుపందేలు పెడుతున్నారు. కుక్కలు, ఒంటెలు పెంపుడు జంతువులుగా మారిపోయి చాలాకాలమైంది. మా జీవనోపాధి కోసం జంతువులకు, పక్షులకు ఎంతో శ్రమ పడి శిక్షణ ఇస్తాం. వాటిని హింసించకుండా, మచ్చిక చేసుకుంటేనే అది సాధ్యమౌతుంది. కానీ ఇతరుల్లాగా మమ్మల్ని పరిగణించడం లేదు? ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు రఫిక్‌. ‘ఈ రోజుల్లో చిన్న పిల్లలు సినిమాలు, నాటికల్లో నటిస్తున్నారు. ప్రతిభ చూపుతున్నారు. వారిని ప్రోత్సహిస్తున్న వారు మా పిల్లలపై ఎందుకు కక్ష కడుతున్నారు? బాలకార్మికులుగా తయారుచేస్తున్నామని మాపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఈ వ్యత్యాసం చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యమేస్తుంది!” అని రఫిక్‌ అంటున్నారు.


రష్యాలో ఇలా లేదు..
”రష్యాలో పిల్లలకు ప్రత్యేకంగా సర్కస్‌ శిక్షణ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. అక్కడ శిక్షణ తీసుకున్న పిల్లలే జిమ్నాస్టిక్‌లో అంతర్జాతీయంగా ప్రతిభ చూపుతున్నారు. ఒలింపిక్స్‌ ఆడుతున్నారు. అక్కడ ఆ పిల్లలను బాల కార్మికులుగా పరిగణించడం లేదు. కళాకారులుగా గుర్తిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. గ్యారేజ్‌లో పనిచేసే పిల్లలకు, సర్కస్‌లో పనిచేసే పిల్లలకు చాలా తేడా ఉంది’ అంటున్న రఫిక్‌ లాంటి కళాకారులు ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగి ఇప్పుడు వెలవెలబోతున్న బతుకులు బతుకుతున్నారు. వారిని చూసి జాలి పడక్కర్లేదు. డబ్బు సాయమూ చేయక్కర్లేదు. కళను నమ్ముకుని కళే ప్రాణంగా జీవిస్తున్న వారిని ప్రోత్సహిస్తే చాలు..” అని ముగించారు రఫిక్‌.

➡️