గ్రీక్‌లో ఉద్యమాల హోరు – టెలికాం, కాల్‌సెంటర్ల కార్మికుల దేశవ్యాప్త సమ్మె

Feb 9,2024 12:24
  • సిఐటియు అభినందనలు

ఏథెన్స్‌/న్యూఢిల్లీ : గ్రీక్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. విశ్వవిద్యాలయాల ప్రయివేటీకరణకు విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, వ్యవసాయ రంగ సమస్యలపై అన్నదాతలు ఇలా ప్రతిఒక్కరూ పోరుబాట పట్టారు. తాజాగా గ్రీక్‌లోని నాలుగు అతిపెద్ద టెలికాం కంపెనీలు, కాల్‌ సెంటర్లకు చెందిన కార్మికులు గురువారం దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత పద్ధతుల్లో సమ్మెను దిగ్విజయంగా నిర్వహించిన గ్రీక్‌ టెలికాం, కాల్‌ సెంటర్‌ వర్కర్లకు సిఐటియు అభినందనలు తెలిపింది. ప్రపంచ కార్మిక సంఘాల వేదిక (డబ్ల్యుఎఫ్‌టియు)లో భాగంగా ఉన్న సిఐటియులో 70 లక్షల మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కార్మికోద్యమాల నిర్మాణంతో పాటు ప్రపంచ కార్మికోద్యమాలకు కూడా అవసరమైనప్పుడల్లా సంఘీభావం తెలియజేయడంతో సిఐటియు ముందుంటోంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుకూలంగా వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో గ్రీక్‌లోని నాలుగు బడా కంపెనీల కార్మికులు చేపట్టిన సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పైరవీస్‌ ప్రాంతీయ ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో కార్మికోద్యమ నాయకులు ప్రసంగించారు. అనంతరం టెలి ఫెర్ఫార్మెన్స్‌ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. అయితే కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం అంగీకరించలేదు. టెలిఫార్ఫార్మెన్స్‌ సంస్థ తన కార్మికులకు 2010 నుంచి వేతనాలను పెంచడం లేదు. మిగిలిన మూడు టెలికాం సంస్థలు వెబ్‌హెల్ప్‌, టిటిఇసి, ఫౌండెవర్‌ సంస్థల తీరు కూడా ఇదే విధంగా ఉంది. గ్రీకు వర్కర్ల సమ్మెపై జోక్యం చేసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సంస్థల యాజమాన్యంతో చర్చలు జరపాలని గ్రీక్‌ ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్‌ చేసింది. అలాగే గ్రీక్‌ కార్మికులకు సంఘీభావంగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుంబంధ సంఘాలకు సిఐటియు పిలునిచ్చింది.

➡️