మిర్చి ధరలు పతనం- గుంటూరు యార్డుకు పోటెత్తిన టిక్కిలు

Feb 22,2024 08:10 #decreses, #mirchi rates

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రద్దీ కొనసాగుతోంది. గత కొంత కాలంగా రోజుకు లక్షకుపైగా టిక్కిలు వస్తున్నాయి. బుధవారం 1,39,400 టిక్కిలు యార్డుకు వచ్చాయి. పాత నిల్వలతో కలిపి 1,35,644 టిక్కిలు అమ్ముడుపోయాయి. ఇంకా 1,09,411 టిక్కిలు నిల్వ ఉన్నాయి. గత ఏడాది మిర్చి ధరలు గరిష్టంగా రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు పలికాయి. ప్రస్తుతం మేలు రకం తేజ, బాడిగ రకాలు కనిష్టంగా రూ.8 వేలు ఉండగా గరిష్టంగా రూ.21 వేలు పలికాయి. సాధారణ రకాల ధరలు కనిష్టంగా రూ.9 వేలు పలకగా గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే పలికాయి. 334 రకం గరిష్ట ధర క్వింటాలు రూ.20,700, నెంబరు-5 రూ.19 వేలు, 273 రకం గరిష్టంగా రూ.16,500, 341 రకం రూ.20 వేలు, సూపర్‌-10 రూ.19 వేలు పలికాయి. గత నెల రోజుల కాలంలో సరుకు ఎక్కువ వచ్చిన రోజున ధరలు తగ్గించడం, సరుకు తక్కువగా వచ్చిన రోజున సగటు ధర స్వల్పంగా పెంచడం వ్యాపారులకు పరిపాటిగా మారింది. ఏ వెరయిటీ కూడా గరిష్టంగా రూ.21 వేలు పలకడంలేదు. ఒకేసారి సరుకు ఎక్కువగా రావడం వల్ల ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇళ్లల్లో నిల్వ చేసుకోలేమని, కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకున్నా ప్రస్తుతం అప్పులు చెల్లించేందుకు నగదు అవసరమని, అందువల్ల అయినకాడికి అమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు.

➡️