పిల్లలు మెచ్చిన మాస్టారు

Dec 24,2023 11:45 #Sneha

రాఘవాపురంలో అది ఒక ఉన్నత పాఠశాల. వేసవి సెలవుల తరువాత విద్యా సంవత్సరం మొదలైంది. తొమ్మిదవ తరగతి నుండి పదవ తరగతికి ఉత్తీర్ణులై, ఇరవై మంది విద్యార్థులు వచ్చారు. వారిలో బాగా అల్లరిగా ఉండేవారు రాజు, చంద్ర, పవన్‌. ఆ అల్లరి మూకకు నాయకుడు రవి. అతను ధనవంతుల బిడ్డ అల్లరి మూకకు చిరుతిళ్లు బాగా తినిపిస్తాడు.. అంతేకాదు వాళ్ల నాన్న ఆ పాఠశాల నిర్మాణం కోసం ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా పాఠశాల వృద్ధి కోసం పెద్ద మొత్తంలో ధనం కూడా ఇచ్చాడు. దాంతో ప్రధానోపాధ్యాయుడు మొదలు ఉపాధ్యాయులు కూడా రవి జోలికి వెళ్ళేవారు కాదు. తెలుగు ఉపాధ్యాయుడు ప్రభాకరం గారు బదిలీ మీద ఆ పాఠశాలకు వస్తున్నారని.. ఆయనకు చాలా మంచి పేరుందని పిల్లలకు తెలిసింది. ‘ఆ.. ఎవరైతే ఏంటి మన అల్లరి మనదే!’ అన్నాడు రవి. ‘ఇప్పుడు మనం పదవ తరగతికి వచ్చాము.. మన భవిష్యత్తు నిర్ణయించేది ఈ పదవ తరగతే అన్న విషయం మరచిపోవద్దు’ అన్నాడు ఎప్పుడు చదువులో ముందుండే రాము.’నువ్వు పాసయితే చాలు. మాతో నీకు పని లేదు’ అన్నాడు రవి. రాము మరింకేమీ మాట్లాడలేదు. ప్రభాకరం గారు పదవ తరగతికి వచ్చారు. మొదటిరోజు అందరి పరిచయాలయ్యాక మాస్టారు బ్లాక్‌ బోర్డ్‌ మీద వరుసగా 20 మంది విద్యార్థుల పేర్లు ఒక విద్యార్థితో రాయించాక పేర్ల ప్రక్కన రెండు నిలువు గీతలు కొట్టి మంచి పనులు/అల్లరి పనులు అని వ్రాశారు. అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. ‘మీరు పాఠశాల అయిపోయేవరకు మంచి పనులు చేస్తే మీ పేరు ఎదురుగా వాటి సంఖ్య ఉంటుంది.. అల్లరి పనులకు కూడా ఇదే విధంగా సంఖ్య ఉంటుంది’ అని వివరణ ఇచ్చారు మాస్టారు. తరువాత తెలుగు పాఠం మొదలుపెట్టారు.మరుసటి రోజు ప్రభాకరం మాస్టారు తరగతికి రాగానే విద్యార్థుల హాజరు తీసుకుని బ్లాక్‌ బోర్డ్‌ మీద రవి, రాజు, చంద్ర, పవన్‌ పేర్ల ఎదురుగా అల్లరిపనులు కాలంలో 10,6,5,3 అని రాశారు. మంచి పనుల కాలంలో రాము పేరు ఎదురుగా రెండు రాశారు. ‘అల్లరి పనులగురించి అది చేసిన వారికి తెలిసే ఉంటుంది. రవి చేసిన మంచి పనులు ప్రాంగణంలో మొక్కల వద్ద ఉన్న చెత్తను తీసి వేయడం, మొక్కలకు నీరు పోయడం’ అని చెప్పారు మాస్టారు.ఇలా ఒక మాసం గడిచింది. రాముతో పాటు కొందరు విద్యార్థులు మంచి పనుల సంఖ్యలో ముందుంటే రవితో పాటు అతని స్నేహితుల అల్లరి పనుల సంఖ్య యాభై నుండి వందకు చేరింది. ఇది చూసి మిగతా విద్యార్థులు నవ్వుకోసాగారు ‘మంచి పనులు చేయకున్నా అల్లరి పనులు చేయడం మానండి’ అన్నారు ప్రభాకరం మాస్టారు. ఆరోజు నుండి క్రమ క్రమంగా అల్లరిపనులు పూర్తిగా తగ్గిపోయాయి. ‘మీలో మార్పు వచ్చినందుకు ధన్యవాదాలు’ అని రవితో పాటు అతని ముగ్గురు మిత్రులకు మంచి పెన్నులు కానుకగా ఇచ్చారు. ఆరు నెలల పరీక్షలు మొదలయ్యాయి. ప్రభాకరం గారితో సహా ఇతర ఉపాధ్యాయులు రోజువారీగా వారి వారి పాఠ్యాంశాలకు సంబంధించిన పరీక్షలు విద్యార్థులకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పెట్టారు. పరీక్షలు అయిపోయాక ఉపాధ్యాయుల విశ్రాంతిగదికి పదవ తరగతి విద్యార్థులనందరినీ ఒక్కొక్కరిగా పిలిపించారు ప్రభాకరం మాస్టారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు తమ పాఠ్యాంశానికి సంబంధించిన విద్యార్థుల జవాబు పత్రాలను తీసి ‘మీరు రాసిన జవాబులే కదా? ఎక్కడ పడితే అక్కడ కొన్ని ప్రశ్నలను అడుగుతాము జవాబులు చెప్పండి?’ అని ఒక్కొక్క విద్యార్థిని అడిగారు బాగా చదివిన విద్యార్థి వెంటనే జవాబులు చెప్పాడు. రవి అతని మిత్రులు ఏ ఒక్క పాఠ్యాంశానికి సంబంధించిన జవాబులు ఒక్కటి కూడా చెప్పలేకపోయారు. ప్రభాకరం గారు కలగజేసుకుని ‘రవి నీతో సహా నీ ముగ్గురు మిత్రులు కూడా కాపీ కొట్టారని అర్థమయ్యింది. తరగతిలో మీరు పరీక్షలు రాసేప్పుడు మేము కావాలనే మిమ్ములను పట్టించుకోలేదు. ఫైనల్‌ పరీక్షలు మీరు ఇతర పాఠశాలలో రాయవలసి వస్తుంది.. కాపీలు కొడుతూ స్క్వాడ్‌కు పట్టుపడితే సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు డిబార్‌ అయ్యే అవకాశం ఉంది అంటే పరీక్షలు రాయనివ్వరు.. ఇది ఎంతో అవమానకరమైన విషయం. మిమ్ములను ఉత్తములుగా తీర్చిదిద్దడమే మా ఉపాధ్యాయుల లక్ష్యం పదవ తరగతి మీ పై చదువులకు పెద్ద పునాది వంటిది’ అని చెప్పారు. ‘అవును ఇప్పటికయినా మించి పోయింది లేదు. ఫైనల్‌ పరీక్షలకు ఇంకా సమయం ఉంది. మీరు కష్టపడి చదవండి మిమ్ములను చదివించే బాధ్యత మాది’ అని అన్నారు లెక్కల మాస్టారు శివయ్య గారు. ‘మా తప్పు తెలుసుకున్నాము ఇక నుండి ఇష్టంగా కష్టపడి చదువుతాము’ అన్నారు రవితో సహా అతని మిత్రులు. అది మొదలు ఫైనల్‌ పరీక్షల వరకు రవి అతని మిత్రులు చదువుపై దృష్టి పెట్టారు. ఫలితాలు వచ్చాయి. రాము ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణుడవ్వగా, రవి అతని మిత్రులతో పాటు తరగతిలో అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇదంతా ప్రభాకరం మాస్టారు ప్రణాళిక అని ఇతర ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు ఆయన్ని కొనియాడారు. విద్యార్ధులంతా మాస్టారుకు ధన్యవాదాలు తెలిపారు.

యు విజయశేఖరరెడ్డి,

హైదరాబాద్‌, 9959736475

➡️