ఆగని బాల్య వివాహాలు

Dec 18,2023 11:01 #Child Marriages, #Health Sector, #India
child marriages increases india

న్యూఢిల్లీ : మన దేశంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు, ప్రతి ఆరుగురు బాలురులో ఒకరు చట్టబద్ధమైన వయసు రాకుండానే వివాహం చేసుకుంటున్నారు. దేశంలో గత మూడు దశాబ్దాల కాలంలో జరిగిన బాల్య వివాహాలపై జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జరిగిన కుటుంబ ఆరోగ్య సర్వేల ఆధారంగా అధ్యయనం చేశారు. 1993లో బాలికలలో 49 శాతం మందికి బాల్య వివాహాలు జరగగా, 2021 నాటికి అది 22 శాతానికి తగ్గిందని అధ్యయనం తెలిపింది. యువకుల చట్టబద్ధ వివాహ వయసు 21 సంవత్సరాలుకాగా, ఆ లోపు వయసున్న వారిలో 15.49 శాతం మంది 2021లో వివాహం చేసుకున్నారు. 2021లో బాల్య వివాహాలు చేసుకున్న బాలుర (18 సంవత్సరాల లోపు వయసు వారు) సంఖ్య మొత్తం బాలుర సంఖ్యలో రెండు శాతం మాత్రమే ఉంది. అదే 1993లో ఏడు శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే 2021లో 18 సంవత్సరాలు నిండకముందే 1.3 కోట్ల మంది బాలికలు, 14 లక్షల మంది బాలురు వివాహం చేసుకున్నారు. లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో శనివారం అధ్యయన వివరాలను ప్రచురించారు. మహిళల వివాహ వయసును పురుషులతో సమానంగా 21 సంవత్సరాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తున్న సమయంలో ఈ అధ్యయన వివరాలు బయటకు రావడం గమనార్హం. ‘బాలికల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ వయసును 21 సంవత్సరాలకు పెంచాలన్న ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎస్‌వి సుబ్రమణ్యం చెప్పారు. బాలికల వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచితే ఇప్పటికే అమలులో ఉన్న 18 సంవత్సరాల నిబంధనకు కట్టుబడి ఉన్న కుటుంబాలు ఇకపై తమ కుమార్తెలకు త్వరగా వివాహం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ రాష్ట్రాల్లో అధికంపశ్చిమ బెంగాల్‌, బీహార్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధ్యయనం తెలిపింది. 2021లో దేశంలో 1.3 కోట్ల మంది బాలికలకు బాల్య వివాహాలు కాగా వారిలో ఒక్క బీహార్‌లోనే 16 శాతం మంది ఉన్నారు. బెంగాల్‌లో 15 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 12 శాతం, మహారాష్ట్రలో 8 శాతం మంది బాలికలకు బాల్య వివాహాలు జరిగాయి. ఇక బాలుర విషయానికి వస్తే 2021లో 18 సంవత్సరాల లోపు వయసున్న 14 లక్షల మందికి బాల్య వివాహాలు జరగగా వారిలో గుజరాత్‌లో అత్యధికంగా 29 శాతం మంది, బీహార్‌లో 16 శాతం మంది, పశ్చిమ బెంగాల్‌లో 12 శాతం మంది, ఉత్తరప్రదేశ్‌లో 8 శాతం మంది ఉన్నారు.

➡️