ఆశయ పథంలో అక్షర గమనం

 ‘సాహిత్య ప్రస్థానం’ 20 వసంతాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో తెలకపల్లి రవి

ప్రజాశక్తి-విజయవాడ : ఏ ప్రమాణాలు, లక్ష్యాలతోనైతే ప్రారంభించబడిందో అదే ఆశయంతో 20 ఏళ్లుగా ‘సాహిత్య ప్రస్థానం’ కొనసాగుతుందని, ప్రజాసాహిత్యం అందిస్తూ మున్ముందుకు సాగుతోందని సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. ‘సాహిత్య ప్రస్థానం’ 20 వసంతాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో ఆదివారం సామంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ అధ్యక్షత వహించారు. ప్రస్థానం 20 వసంతాల ప్రత్యేక సంచికను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ జి అనిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ, నేడు కేంద్రంలోని మతతత్వ పాలకుల ఏలుబడిలో రాజ్యాంగ విలువలు, లౌకికతత్వం ప్రమాదంలో పడ్డాయని, భిన్నాభిప్రాయానికి తావులేని నిరంకుశత్వం కొనసాగుతోందని అన్నారు. ఇలాంటి ప్రమాదాన్ని కవులూ రచయితలూ కళాకారులూ ఉమ్మడిగా ప్రతిఘటించాల్సిన అవసరాన్ని సాహిత్య ప్రస్థానం ఇరవై ఏళ్ల కిందటే గుర్తు చేసిందని చెప్పారు. సాహిత్య ప్రస్థానం ఆశయ పథంలో పయనిస్తూ, ప్రజాసాహిత్యానికి వేదికగా నిలిచిందని, వందలాది మంది కవులూ రచయితల స్వరాలకు, కలాలకు దన్నుగా నిలిచిందని అన్నారు. ఈ రెండు దశాబ్దాల్లో అనేక మంది సాహితీ వేత్తలు, సాహితీ అభిమానులు ఆర్థికంగా, హార్ధికంగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. మతతత్వం, మార్కెట్‌ మాయాజాలం విజృంభిస్తున్న నేటి కాలంలో సాహితీ ప్రస్థానం ప్రాధాన్యత మరింత పెరిగిందని అన్నారు. సమాజాన్ని జాగృతం చేసే దిశగా సాహిత్యకారులు మరింత చురుకైన, పదునైన సాహిత్యాన్ని సృష్టించాలని అన్నారు.
నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ జి.అనిత మాట్లాడుతూ, అభ్యుదయ సాహిత్యం అందించే ప్రయత్నంలో ఎక్కడా రాజీపడకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రస్థానం పత్రికను నడపటం అభినందనీయమని అన్నారు. నిబద్ధతకు, విలువలకు ప్రతీకగా నిలిచే సంస్థ ఆధ్వర్యాన ఈ పత్రిక మరింత మున్ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 20 వసంతాల ప్రత్యేక సంచికను ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజీ పరిచయం చేశారు. ఈ 20 ఏళ్లలో సమాజ పరిణామ క్రమాన్ని వివరించే, వ్యాఖ్యానించే అనేక కథలను, కవితలను ప్రస్థానం ప్రచురించిందని చెప్పారు. వాటిలో ఉదహరణీయంగా ఉన్న 9 కథలు, 24 వ్యాసాలను, కవితలను, కీలకమైన కార్యక్రమాల నివేదికలను ఈ సంచికలో ప్రచురించామని చెప్పారు. తెలంగాణా సాహితి అధ్యక్షులు కె.ఆనందారి మాట్లాడుతూ, సమాజంలో నెలకొన్న పలు రుగ్మతలను ఎత్తి చూపుతూ సాహితీ ప్రస్థానం తన గమనాన్ని కొనసాగించిందని అన్నారు. ఒక సమగ్రమైన ఆలోచనలకు ప్రస్థానం పునాది వేసిందని చెప్పారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఓ శాంతిశ్రీ మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుంచి అనేక ప్రత్యేక సంచికలతో ప్రస్థానం విశేషమైన కృషి చేసిందని చెప్పారు. విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ, ప్రస్థానం శ్రేయోభిలాషులు సతీష్‌, కిషోర్‌లకు తెలకపల్లి రవి ప్రత్యేక సంచికను అందజేశారు. స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమారస్వామి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరంజన్‌, కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, ప్రజాశక్తి బుకహేౌస్‌ జిఎం కె లక్ష్మయ్య, పలువురు సాహితీ వేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

➡️