మారుతున్న ‘అనంత’ సాగు – అందని ప్రభుత్వ సాయం

Dec 2,2023 07:14 #Editorial

జిల్లా రైతులు తమ స్వంత అనుభవంతో కొద్దిపాటి నీటి వనరులతో, పరిమితమైన ఆర్థిక శక్తితో వైవిధ్యంతో కూడిన పంటలు పండిస్తుంటే వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జొరబడుతున్నాయి. రిలయన్స్‌, బిర్లా మోర్‌, వెజిటబుల్‌ బాస్కెట్‌, బిగ్‌ బాస్కెట్‌ లాంటి అనేక కంపెనీలు ముందస్తుగా పండ్లతోటల రైతులతో ఒప్పందాలు చేసుకుని, ఆ రైతులకు రుణాలు, పరుగు మందులు, పంట పర్యవేక్షణ లాంటి రూపాల్లో రైతులకు వల వేస్తున్నాయి. ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడంతో రైతులు అనివార్యంగా ఈ కంపెనీల మీద ఆధారపడాల్సి వస్తోంది.

             రాష్ట్రంలో అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒకనాడు కొర్రలు, జొన్నలు లాంటి ఆహారధాన్యాలు మాత్రమే పండించారు. 1980 తర్వాత రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా వేరుశనగ పంట సాగయింది. ఒక దశలో ఖరీఫ్‌లో సాగయిన మొత్తం భూమిలో 98 శాతం వేరుశనగ పంట మాత్రమే పండించే పరిస్థితి ఏర్పడింది. గత ఆరేడు సంవత్సరాలుగా ఉద్యానపంటల సాగు పెరిగి నేడు విభిన్న రకాల పండ్లు, పూలు పండిస్తూ అనంత జిల్లా…రాష్ట్ర పండ్లతోటల కేంద్రంగా మారింది. ఎడారి నుండి మంచు పర్వతాల వరకు ఎక్కడ ఏ పంటలు పండుతాయో వాటన్నింటినీ ఈ జిల్లాలో పండించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ మార్పులకు తోడుగా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు తమ విధానాల వల్ల ఆటంకాలు కలిగిస్తున్నాయి. రిలయన్స్‌, అదానీ, బిర్లా మోర్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడ పండుతున్న పండ్లు, కాయగూరలు, పూల కొనుగోలులోకి జొరబడి క్రమంగా తామే పంటలు సాగు చేయడానికి, కాంట్రాక్టు వ్యవసాయానికి సిద్ధమవుతున్నాయి.

జిల్లా రైతులను ముంచిన వేరుశనగ

అనంతపురం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 11,35,913 హెక్టార్లు. ఇందులో వ్యవసాయ సాగు భూమి 6,01,245 హెక్టార్లు. ఇందులో స్థిరీకరించబడిన ఆయకట్టు 18,302.07 హెక్టార్లు. మొత్తం సాగు భూమిలో కేవలం 3.04 శాతం భూమికి మాత్రమే సాగు నీటి వనరులున్నాయి. ఇక్కడ వ్యవసాయం అంటే మెట్ట వ్యవసాయమే. వర్షం మీద ఆధారపడి పంటలు పండే పరిస్థితి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1961-62లో 7,28,753 హెక్టార్లలో ఆహారధాన్యాల పంటలు సాగు కాగా, 1991-92 నాటికి 1,63,015 హెక్టార్లకు తగ్గి, 2021-22లో తిరిగి 2,52,568 హెక్టార్లకు పెరిగింది. 1961-62లో 1,94,840 హెక్టార్లలో సాగు అయిన వేరుశనగ పంట 2005-06 నాటికి 8,11,156 హెక్టార్లకు భారీగా పెరిగింది. ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం సాగు భూమిలో 98 శాతం వేరుశనగ పంట మాత్రమే సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. 2006-07 నాటికి రాష్ట్రంలో మొత్తం వేరుశనగ పంట సాగులో ఒక్క అనంతపురంలోనే 50 శాతం సాగు అయ్యిందని ఎం.ఎస్‌.స్వామినాథన్‌ ఫౌండేషన్‌ 2010లో రిపోర్టు ఇచ్చింది. వేరుశనగ పంట సాగు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి-జిల్లాలో సకాలంలో వర్షాలు రాకపోవడంతో ఆహార ధాన్యాల పంటలు పెద్ద ఎత్తున నష్టపోవడం. రెండు-హరిత విప్లవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆయిల్‌ పంటల సాగు పెంచాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేయడం. వేరుశనగ తప్ప ఇక్కడ ఏ పంటా పండదు అనేంతగా రైతుల మానసిక స్థితిని పాలకులు మార్చగలిగారు.

అయితే జిల్లా రైతులకు వేరుశనగ పంట సాగు తీవ్ర విషాదాన్ని నింపింది. 1998 తర్వాత నుండి సుమారు 10 వేల మందికి పైగా వేరుశనగ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష మందికి పైగా వ్యవసాయ కార్మిక కుటుంబాలు ప్రతి సంవత్సరం వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వర్షాలు రాక పంట నష్టపోవడం, పంటలను కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున బోర్లు వేయించి అప్పుల ఊబిలో కూరుకుపోవడం, పంట నష్టపరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వాల తీవ్ర అలసత్వం, పెట్టుబడి ఖర్చులు పెరిగినంతగా గిట్టుబాటు ధర లేకపోవడం, కొత్త రకం తెగుళ్లు, తగ్గిన పంట దిగుబడులు ఇందుకు కారణాలు. 1972-73 సంవత్సరంలో వేరుశనగ హెక్టారుకు భారతదేశంలో 762 కేజీల దిగుబడి రాగా, ఆంధ్రప్రదేశ్‌లో 831, అనంతపురంలో 751 కేజీలు వచ్చింది. కానీ 2004-05 నాటికి దేశంలో హెక్టారుకు 1188 కేజీలు, రాష్ట్రంలో 760, అనంతపురంలో 516 కేజీలకు పడిపోయింది. 1991 తర్వాత పాలకుల విధానాల్లో వచ్చిన మార్పులు వేరుశనగ రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. వేరుశనగ కొత్త విత్తనాల పరిశోధనలు నిలిపి వేయడం, ఎరువులు, పురుగు మందుల ధరలు పెంచడం, పంటలకు మద్దతు ధర అమలు చేయకపోవడం, విత్తనాల కొరత, ముఖ్యంగా పామాయిల్‌ పెద్ద ఎత్తున విదేశాల నుండి దిగుమతి చేసుకోవడంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వీటిని నివారించి జిల్లా రైతాంగాన్ని శాశ్వతంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు నియమించిన నిపుణుల కమిటీల సిఫార్సులు ఏవీ అమలు కాకపోవడంతో రైతులు వేరుశనగ సాగు పట్ల తీవ్ర విముఖత చూపారు. గతంలో 20 లక్షల ఎకరాల్లో సాగు అయిన వేరుశనగ పంట 2022-23 (28-08-23) నాటికి 5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యింది.

ఉద్యానవన పంటలు

ఆహార పంటల సాగు తగ్గి వేరుశనగ సాగు పెరిగినట్లుగా ప్రస్తుతం జిల్లాలో ఉద్యానవన పంటల సాగు భారీగా పెరిగింది. వేరుశనగ పంట గిట్టుబాటు కాకపోవడంతో ఇతర పంటల వైపు రైతులు వెళ్లడం, హంద్రీ నీవా నీరు చెరువులకు చేరడం, గత పది సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు సకాలంలోనో, అకాలంలోనో కొద్దిమేరకు వర్షాలు రావడం, భూగర్భ జలాలు పెరగడం, ప్రభుత్వాలు ఎక్కువ మొత్తం సబ్సిడీతో డ్రిప్‌, స్ప్రింక్లర్లు రైతులకు అందించడంతో ఉద్యాన పంటల సాగు పెరిగింది. ఎడారిలో పండే ఖర్జూరం మొదలు ఆధునికమైన డ్రాగన్‌ ఫ్రూట్స్‌ వరకు, చెండు పూల నుండి లిల్లీ పూల వరకు వివిధ రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. ప్రస్తుతం 26 రకాల పండ్లు, 29 రకాల కాయగూరలు, 22 రకాల పూలు, 10 రకాల మసాలా దినుసులు పండిస్తున్నారు. ఇంతటి వైవిధ్యమైన పంటలను పండించడం వెనుక అందుబాటులోకి వచ్చిన తుంపర సేద్యం, కొద్దిపాటి నీటివనరులు ఒక కారణమైతే, చదువుకున్న రైతు కుటుంబాల పిల్లలు ఐ.టి లాంటి రంగాల్లో ఉపాధి పొంది ఈ పంటల పెట్టుబడికి సహాయపడడం మరో కారణం. 2018-19 సంవత్సరంలో రెండున్నర లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కాగా 32,37,667 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో పండ్లతోటలు సాగయ్యాయి. మామిడి విస్తారంగా పెరిగింది.

ఉద్యాన పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ. అందువల్ల రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు మొదట్లో అనేక రాయితీలు ఇచ్చాయి. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలిపివేసింది. దీంతో రైతులపై అదనపు భారం పండింది. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీనివల్ల దళారీల దయ మీద ఆధారపడి రైతులు తమ పంటలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పండే పండ్లను ఢిల్లీ మార్కెట్‌కు తరలించి రైతులను ఆదుకుంటామని గత రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఒక్కసారి ఢిల్లీ వెళ్లిన రైలు ఆ తర్వాత అడ్రస్‌ లేకుండా పోయింది. మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది.

డ్రిప్‌, స్ప్రింక్లర్లు

వేరుశనగ పంటల సాగు నుండి రైతులు ఉద్యానపంటలు, కాయగూరలు, మసాలా దినుసుల లాంటి పంటల వైపు మళ్ళడంలో ప్రభుత్వాలు సబ్సిడీతో డ్రిప్‌, స్ప్రింక్లర్లు మంజూరు చేయడం, ఉపాధి హామీ పథకం కింద చెట్ల పెంపకం చేర్చడం, కొన్ని స్వచ్ఛంద సంసల్థు పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం లాంటివి కీలక పరిణామాలు.

జిల్లాకు తుంపర సేద్యం (మైక్రో ఇరిగేషన్‌) కింద 2003-04 సంవత్సరంలో 5,001 మంది రైతులకు (8,787 హెక్టార్లకు) డ్రిప్‌, స్ప్రింక్లర్లు మంజూరు కాగా, 2007-08లో 11,940 మంది రైతులకు (15,868.25 హెక్టార్లకు), 2017-18 నాటికి 18,677 మంది రైతులకు (22,717 హెక్టార్లకు) విస్తరించింది. ఇదే సంవత్సరాల్లో ప్రస్తుత సత్యసాయి జిల్లాను కూడా కలిపి చూస్తే 2003-04 సంవత్సరంలో 9,737 మంది రైతులు 17,468 హెక్టార్లు, 18,841 మంది రైతులు 23,695 హెక్లార్లు, 2017-18 నాటికి 29,720 మంది రైతులు 34,814 హెక్టార్లకు ఈ తుంపర సేద్యం విస్తరించింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్‌, స్ప్రింక్లర్లు మంజూరు నిలిపివేయడంతో రైతులపై అదనపు భారం పడింది. 2022-23లో 11,061 మంది రైతులు 13,671 హెక్టార్లలో స్ప్రింక్లర్లతో సాగు చేయగా…2023-24 సంవత్సరంలో మరింతగా తగ్గి 6,827 మంది రైతులు 8,349 హెక్టార్లలో మాత్రమే తుంపర సేద్యం సాగు చేసే పరిస్థితి వచ్చింది. పండ్లతోటల సాగు మధ్యలో తుంపర సేద్యానికి ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేయడం సాగు విస్తీర్ణం మీద, రైతుల ఆర్థిక పరిస్థితుల మీద తీవ్ర ప్రభావం పడింది.

కార్పొరేట్‌ కంపెనీల వల

జిల్లా రైతులు తమ స్వంత అనుభవంతో కొద్దిపాటి నీటి వనరులతో, పరిమితమైన ఆర్థిక శక్తితో వైవిధ్యంతో కూడిన పంటలు పండిస్తుంటే వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జొరబడుతున్నాయి. రిలయన్స్‌, బిర్లా మోర్‌, వెజిటబుల్‌ బాస్కెట్‌, బిగ్‌ బాస్కెట్‌ లాంటి అనేక కంపెనీలు ముందస్తుగా పండ్లతోటల రైతులతో ఒప్పందాలు చేసుకుని, ఆ రైతులకు రుణాలు, పురుగు మందులు, పంట పర్యవేక్షణ లాంటి రూపాల్లో రైతులకు వల వేస్తున్నాయి. ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడంతో రైతులు అనివార్యంగా ఈ కంపెనీల మీద ఆధారపడాల్సి వస్తోంది. గార్ల దిన్నె, నార్పల, శింగనమల, బుక్కరాయ సముద్రం మండలాల్లో ఏ రోజుకారోజు కాయగూరలను రైతుల ద్వారా ఒక సెంటర్‌కు చేర్పించుకుని అక్కడే గ్రేడింగ్‌ చేసి మొదటి రకం వాటిని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లలో ఉన్న తమ మాల్స్‌కు పంపుతారు. అక్కడ వీరు కొనుగోలుదార్లకు ఎక్కువ ధరకు అమ్ముకుని లాభపడుతుండగా వాటిని సాగు చేసిన రైతులు మాత్రం దివాళా తీస్తున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టడంలేదు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో వ్యవసాయ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవసాయ శాఖలో నూతన పరిజ్ఞానం కలిగిన సిబ్బందిని నియమించడం, రైతులకు రుణ సదుపాయం, మార్కెట్‌ సౌకర్యం కల్పించడం చేపట్టాలి. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరించే కార్పొరేట్‌ విధానాలకు మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం (ప్రధాన ప్రతిపక్షం సంగతి సరేసరి) రైతులను ఆదుకునే దిశగా కదలడం లేదు. ఇందుకు పంటల వారీగా నిర్దిష్ట డిమాండ్లతో రైతులు ఐక్య పోరాటాలు చేయడమే పరిష్కారం.

(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)వి. రాంభూపాల్‌

➡️