రైతులను మోసగిస్తున్న కేంద్ర ప్రభుత్వం

-ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయండి : ఆహ్వాన సంఘం

ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఎంఎ.గఫూర్‌, ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి విమర్శించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో కర్నూలులో జరిగే ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా 15న నిర్వహించే రైతు ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. కర్నూలులోని కార్మిక, కర్షక భవన్‌లో వారు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎలా తిప్పి కొట్టాలనే అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తిప్పి కొట్టడం దేశ చరిత్రలో ఒక కీలక ఉద్యమమని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎఐకెఎస్‌ నాయకులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారని తెలిపారు. కార్మిక, కర్షక ఐక్యత ఆచరణ ఢిల్లీ ఉద్యమం ద్వారా బలంగా నిర్మించబడుతోందన్నారు. రైతులకు, కార్మికులకు ఈ సమావేశాల ద్వారా ఒక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి 140 మంది రైతు ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. వ్యవసాయంపై శ్రద్ధలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు. కె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15న జరిగే బహిరంగ సభలో ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షులు అశోక్‌ దావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా పాల్గంటారని తెలిపారు. ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల నేపథ్యంలో సోమవారం నుండి ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయని చెప్పారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌, పిజి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆహ్వాన సంఘం చీఫ్‌ ప్యాట్రన్‌ ఆర్జా రామకృష్ణ మాట్లాడుతూ రైతుత పరిస్థితి దేశంలో అందరి కన్నా దీనంగా ఉందన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ పాల్గొన్నారు.ఆటో ప్రచార జాత ప్రారంభంఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల జయప్రదానికి ఆటో ప్రచార జాతాను సుందరయ్య భవన్‌ వద్ద ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, ఆటో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్‌, ఆటో యూనియన్‌ న్యూ సిటీ అధ్యక్షులు హుస్సేన్‌ వలి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి హుస్సేన్‌ పాల్గొన్నారు.

➡️