కుల దురహంకారమే…

Apr 16,2024 16:50 #judgement, #visakha special court

* వైసిపి మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు
* రూ.2.50 లక్షల జరిమానా : విశాఖ ప్రత్యేక కోర్టు తీర్పు

ప్రజాశక్తి-రామచంద్రాపురం :  కుల వివక్ష నేరం… అది పాటిస్తే శిక్షార్హులవుతారని తెలుసు.. కానీ కులదురహంకారం… అట్టడుగు వర్గాల ప్రజలను లంగదీసుకునే పెత్తందారీతనానికి నిదర్శనం. అధికారమదం… రౌడీయిజంతో తనకు ఎదురొచ్చేవారిని సామ, దాన, దండో పాయాలతో లంగదీసుకునే తత్వం తోట త్రిమూర్తులుది. కుల దురహంకారంతో అడ్డుచెప్పేవారిని అటకాయించటం… బదులు చెబితే బడితపూజతో సమాధానం చెబుతారు. అలాంటిది తనను ఎదురించారనే అక్కసుతో 28 ఏళ్ల క్రితం దళితులను శిరోముండనం చేసిన వ్యక్తి తోట త్రిమూర్తులు. తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. వైసిపి ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.

1994లో బిఎస్‌పి తరపున దళితుడు రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అదే నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు టిడిపి తరపున పోటీచేశారు. అయితే ఆ ఎన్నికల సమయంలో దళితులను బిఎస్‌పి అభ్యర్థికి మద్దతు తెలపొద్దని అనేకసార్లు హెచ్చరించారు. తాము తమ నేతకు మద్దతు ఇస్తామంటూ ప్రచారంలో పాల్గనటం తోట త్రిమూర్తులుకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచినా…. అవకాశం దొరికినప్పుడుల్లా దళితులపై అక్కసుకక్కుతూనే ఉన్నారు. ఎలాగైనా కక్ష సాధించేందుకు ప్రణాళిక రచించారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలోని తన ఇంటికి తోట త్రిమూర్తులు పిలిపించారు. వారిని లంగతీసుకుందామని ప్రయత్నించారు. తీవ్రంగా కొట్టి చంపుతానంటూ బెదిరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గన్న ఐదుగురు దళితులను హింసించారు. వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. కనుబమ్మలను గీయించారు. నానా దుర్భాషలాడి, తీవ్రంగా అవమానించారు. ప్రధాన సాక్షి కోటి రాజు(58) ఈ ఏడాది ఫిబ్రవరి 22న అనారోగ్యంతో మృతి చెందారు. బాధితుల్లో ఒకరు, సాక్షుల్లో ఇద్దరు గతంలోనే చనిపోయారు. మిగతావారు వృద్ధాప్యానికి చేరువలో ఉన్నా ఇప్పటివరకూ న్యాయం మాత్రం జరగలేదు. ఈ కేసులో వైసిపి ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది.

28 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు

రాష్ట్రంలో సంచలనం సఅష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు కోటిరాజు స్వయానా సోదరుడు. 28 ఏళ్ల క్రితం దళితుడైన చినరాజుకు శిరోముండనం చేశారు. అప్పటి నుంచి ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు బాధితులు, సాక్షులు చనిపోయారు. ప్రభుత్వం, న్యాయస్థానాలు స్పందించి న్యాయం చేయాలనీ, నిందితులను శిక్షించాలని శిరోముండనం బాధితులు, దళితులు కోరిన విషయం తెలిసిందే.

అధికార పార్టీల అండతో..
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిందిత గణానికి నిరాటంకంగా అండదండలు అందటం, ఈ కేసులో తీవ్ర జాప్యానికి కారణం. అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని, కేసును అన్ని విధాలుగా నీరుగార్చటంతోపాటుగా నిర్వీర్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద నమోదైన కేసును పక్కదోవ పట్టించటానికి బాధితులు దళితులు కాదనీ, క్రైస్తవులని నిందితుల తరపు నుంచి దాఖలైన వ్యాజ్యంతో కేసు విచారణ ఏళ్లతరబడి ఆగిపోయింది. బాధితులు అధికారులను కదిలించటానికి, తమ కులాన్ని నిరూపించుకోవటానికి దళిత, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ లోగా ఈ కేసులో ప్రధాన ముద్దాయి పార్టీలు మారారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు ఐదోసారి మండపేట నుంచి వైసిపి తరపున పోటీచేయటానికి సిద్ధమయ్యారు. అయితే ఈ కేసులో నిందితులను శిక్షించాలనీ, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘాలు పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేశాయి. దళిత ఉద్యమనేత, న్యాయవాది బజ్జా తారకం ఈ కేసును ముందుకెళ్లేలా కృషిచేశారు.

➡️