హర్యానా మాజీ ఎమ్మెల్యే, సన్నిహితుల నివాసాల్లో ఈడి సోదాలు

 చండీగఢ్‌ :   అక్రమ మైనింగ్‌ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌, సన్నిహితుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, విదేశీ తుపాకులు గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 100 మద్యం బాటిళ్లు, ఐదు కేజీల విలువైన బంగారం, వెండిని గుర్తించినట్లు పేర్కొన్నాయి. గురువారం మొదలైన ఈ సోదాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌, అతని సన్నిహితుల నివాసాల్లో గురువారం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి హర్యానా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురేందర్‌ పన్వార్‌, దిల్‌బాగ్‌ సింగ్‌లతో పాటు పలువురికి చెందిన 20కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు సమాచారం. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం సోనిపట్‌, మొహాలి, ఫరీదాబాద్‌, చండీగఢ్‌, కర్నాల్‌ మరియు యమునా నగర్‌లలోని పలు చోట్ల సోదాలు జరిగాయి. మైనింగ్‌కు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తోందని తెలిపాయి.

కాగా, దిల్‌బాగ్‌ సింగ్‌ ఐఎన్‌ఎల్‌డి నేత అభయ్ సింగ్‌కి అత్యంత సన్నిహితుడు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు మద్దతుగా హర్యానా శాసనసభకు అభయ్  సింగ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

➡️