చెత్త సేకరణ వృత్తి .. సివిల్స్‌పై ఆసక్తి …

Mar 2,2024 09:21

శారీరక శ్రమ పట్ల చిన్నచూపు ఉన్న సమాజం మనది. పైగా కొన్ని వృత్తులంటే చాలా ఏవగింపు కూడా ఉంటుంది. అలాంటి వాటిలో పారిశుధ్య నిర్వహణ ఒకటి. కానీ, ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించటమే వృత్తిగా ఉన్న ఆ కుటుంబంలో పిల్లలెవరూ ఆ పనిని తక్కువగా చూడడం లేదు. అమ్మానాన్నలతో పాటు చెత్త సేకరణలో భాగస్వాములై, ఉన్నత చదువులు చదువుతున్నారు. అలాంటి కుటుంబానికి చెందిన జయలక్ష్మి కథ అందరూ తెలుసుకోదగ్గది.

              తెలంగాణ దిల్‌సుఖ్‌ నగర్‌ సింగరేణి కాలనీకి సమీపంలో తాత్కాలికంగా నిర్మించుకున్న బస్తీ అది. ఉపాధి కోసం ఉన్న ఊరును విడిచిపెట్టి పిల్లాపాపలతో ఆ కుటుంబాలు అక్కడకి చేరుకున్నాయి. తాత్కాలికంగా ఏర్పడ్డ ఆ కాలనీలో ఎక్కువ కుటుంబాలకు చెత్త సేకరణ పని ఉపాధి మార్గం. మొత్తం 20 కుటుంబాలు ఈ పనిలో ఉంటే వాళ్లల్లో సగం కుటుంబాల్లో పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. వారిలో గ్రూప్‌1 కోసం సిద్ధమయ్యేవారు కొందరైతే, ఉన్నత లక్ష్యాల కోసం అహర్నిశలు శ్రమపడుతున్న వారు మరికొందరు. అలాంటి వారిలో ఒక అమ్మాయే జయలక్ష్మి. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

‘చెత్త బండి వచ్చిందమ్మా..’

                 జయలక్ష్మి దినచర్య చెత్త సేకరించడంతో మొదలౌతుంది. ఉదయం 5 గంటలకే ఆమె కుటుంబం చెత్త సంచులతో ఆటోలో బయలుదేరి సలీమ్‌ కాలనీకి చేరుకుంటుంది. అక్కడ ఇంటింటికీ తిరిగి 400 ఇళ్లల్లో చెత్త సేకరిస్తారు. ‘చెత్త బండి వచ్చిందమ్మా’ అని కేకలేస్తూ జయలక్ష్మి వీధులన్నీ తిరుగుతుంది. ఈ పనిలో ఆమెతో పాటు అమ్మానాన్న, గ్రూప్‌1 పరీక్షలకు సిద్ధమవుతున్న అన్నయ్య, ఇంటర్‌ చదువుతున్న చెల్లి నిమగమై ఉంటారు. ఆటో నడపడం, సంచుల్లో చెత్త వేసుకురావడం, ఆటోలో సర్దడం ఇలా ప్రతి పనీ అందరూ చేస్తారు.

మేమెప్పుడూ సిగ్గు పడలేదు..

                   ‘నేను కాలేజీ టైం వరకు పనిచేసి, ఇంటికి వచ్చేస్తాను. అన్నయ్య మాత్రం మధ్యాహ్నం వరకు ఉండి, రూమ్‌కి వెళ్లి గ్రూప్‌-1కి సిద్ధమవుతాడు. మా కాలనీలో మాలాగా చాలామంది పిల్లలు ఉన్నత విద్య చదువుకుంటున్నారు. మేమంతా మా అమ్మానాన్న పనుల్లో సాయంగా వెళతాం. నేనైతే 8వ తరగతి నుంచే వెళుతున్నాను. మేం చేసే పని గురించి మేమెప్పుడూ సిగ్గుపడలేదు. ఈ పని మాకు అన్నం పెట్టింది. చదువు చెప్పిస్తోంది. మా అవసరాలు తీరుస్తోంది. ఎక్కడికి వెళ్లినా నేను చెత్త ఏరుకుని చదువుకుంటున్నాను అని గర్వంగా చెబుతాను’ అంటూ జయలక్ష్మి చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది.

‘చెయ్యి కింద పెట్టు..’

                    చెత్త సేకరిస్తున్న ఈ కుటుంబాలకు స్థిర ఆదాయం ఉండదు. ఇళ్లిళ్లూ తిరుగుతూ డబ్బులు సేకరించుకుంటారు. ‘రూ.50 నుంచి, రూ.150 ఇవ్వడానికి కూడా కొంతమంది నానాయాగీ చేస్తార’ని జయలక్ష్మి చెబుతోంది. ‘అమ్మగారు, చెత్త డబ్బులు ఇవ్వండి..’, ‘అయ్యగారూ, చెత్త డబ్బులు ఇవ్వండి.. ‘ఆంటీ.. అంకుల్‌, చెత్త డబ్బులు ఇవ్వండి..’ పలుకు ఏదైనా చేయి చాచి డబ్బులు అడగాల్సిందే. ఉన్నత విద్య చదువుతున్న ఈ పిల్లలు తాము చేసిన పనికి డబ్బులు అడిగేందుకు ఏమాత్రం సిగ్గుపడరు. కానీ.. ‘మేం ఉదయమే చెత్త సేకరణకు వెళ్లిపోతాం. ఇళ్లల్లో నుంచి చెత్త సేకరించేటప్పుడు, మమ్మల్ని ముట్టుకోకుండా దూరంగా చేయి వుంచి సంచులు అందిస్తారు. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ‘చెయ్యి కింద పెట్టు’ అని పడేసినట్లు డబ్బులు ఇస్తారు. మేము స్నానం చేయలేదని, శుభ్రంగా లేమని అలా చేస్తున్నారని నేను అనుకోను. మాలాంటి వాళ్లపై అనాదిగా పేరుకుపోయిన వివక్షే ఇది’ అంటున్న జయలక్ష్మి చదువులోనే కాదు, సామాజిక అంశాలపై పోరాడడంలోనూ ముందుంటుంది.

సామాజిక చైతన్యంలో చురుకైన పాత్ర

             చెత్త సేకరణ, కాలేజీకి వెళ్లడంతో పాటు కాలనీలో నీళ్లు రాకపోయినా, వీధి దీపాలు వెలగకపోయినా, రోడ్లు బాగోలేకపోయినా పోరాడేందుకు జయలక్ష్మే ముందుంటుంది. బస్తీ పిల్లలు చదువుకోవాలని అధికారులతో మాట్లాడి, తమ కాలనీతో పాటు ఓ ఇరవై కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలను సాధించుకుంది. ‘బస్తీలో పిల్లలకు చదువు విలువ తెలియాలి. నాకు మా నాన్న చెప్పాడు కాబట్టే ఎంత కష్టమైనా చదువుకున్నాను. మరి ఆ పిల్లలకు ఎవరు చెబుతారు? అందుకే వాళ్ల కోసం పోరాడాను.. సాధించాను’ అంటున్న జయలక్ష్మి సాయంత్రాలు బస్తీ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ విద్యతో పాటు బాలల హక్కులు, నెలసరి శుభ్రత, పర్యావరణ పరిశుభ్రత వంటి అంశాలపై చైతన్యం కలిగిస్తోంది. జయలక్ష్మి చొరవ చూసి స్థానికంగా ఉండే ఓ స్వచ్ఛంద సంస్థ తమ కార్యాకలాపాల్లో భాగం చేసింది. అలా ఆ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో జయలక్ష్మి ప్రపంచ స్థాయిలో ఆ సంస్థ నిర్వహించే చిల్డ్రన్‌ పార్టమెంట్‌కు హైద్రాబాద్‌ విభాగ ప్రధానిగా కూడా పనిచేసింది. ఆన్‌లైన్‌ సమావేశాల్లో పాల్గొని దేశ, విదేశీ చిన్నారులతో ముచ్చటించేది. సమస్యలపై చర్చించేది.

చెత్త బండి వర్సెస్‌ అమెరికా

             జయలక్ష్మి స్ఫూర్తి గాథ ఇంకా వుంది. గతేడాది యునైటెడ్‌ స్టేట్స్‌- ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (యుఎస్‌ఐఇఎఫ్‌) వారి ‘గాంధీ-కింగ్‌ ఎక్స్చేంజ్‌ ఇనిషియేటివ్‌’ స్కాలర్‌షిప్‌ పొందిన ప్రతిభావంతురాలు జయలక్ష్మి. మన దేశం నుంచి 4 వేల అప్లికేషన్లు వెళితే అందులో 10 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వారిలో జయలక్ష్మి ఉంది. ఈ అవకాశంతో అమెరికా వెళ్లి రెండు వారాల పాటు మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ మార్గంలో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయనం చేసి వచ్చింది.

అవార్డులు, ప్రశంసలు..

ఆనోటా ఈనోటా జయలక్ష్మి ప్రతిభ వ్యాపించి ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు తీసుకొస్తోంది. 2022లో మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి శక్తివంత మహిళ అవార్డును అందుకుంది. 2021లో బ్రిటీష్‌ హై కమిషన్‌ నుంచి ‘డే ఆఫ్‌ ద గర్ల్‌’ అవార్డులో ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే సంవత్సరం ఢిల్లీకి చెందిన ‘టేల్‌ ఆఫ్‌ హ్యూమన్‌ కైండ్‌’ నుంచి ‘ఛేంజ్‌ మేకర్‌’ అవార్డును అందుకుంది. భవిష్యత్తులో సివిల్స్‌ రాసి, ఐఎఎస్‌ కావాలన్న ఉన్నత లక్ష్యంతో ముందుకెళుతున్న జయలక్ష్మి, తన ప్రయాణంలో విజయం సాధించాలని మనమూ కోరుకుందాం.            – జ్యోతిర్మయి

➡️