అన్న క్యాంటీన్ల రద్దు అన్యాయం

  • యువగళంలో నారా లోకేష్‌

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైసిపి ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభమై పెద్దాపురం, పిఠాపురం, యు.కొత్తపల్లి మీదుగా ఉప్పాడ వరకు సాగింది. పలుచోట్ల నిర్వహించిన సభల్లో ప్రయివేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, బిసి, దళిత సంఘాల నేతలు లోకేష్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. రకరకాల నిబంధనలు విధించి ప్రయివేటు విద్యాసంస్థలను జె ట్యాక్స్‌ కోసం వేధించి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో ప్రయివేట్‌ టీచర్లను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కూలి పనులకు వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయివేటీ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం బిసిలను అణచివేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రూ.75,760 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బిసిలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళితుల వద్ద లాక్కున్న భూములను తిరిగి వారికే అప్పగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తామని, దళితులను వేధించిన వారిపై కఠిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లింల సంక్షేమాన్ని వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పాదయాత్రలో టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ, జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️