ప్రచారాలు బుజ్జగింపులు

ప్రజాశక్తి-కడప ప్రతినిధి కడప, అన్నమయ్య జిల్లాల్లో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌ మినహా వైసిపి, టిడిపి, పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. ప్రతిపక్ష టిడిపిలో టికెట్లు దక్కని నాయకుల నుంచి అస తృప్తుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లిలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే కమలాపురం, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజక వర్గాల పరిధిలోని అసంతృప్తులైన సతీష్‌రెడ్డి మొదలుకుని సాయినాధ్‌శర్మ, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజుపాలెం ఎంపిపి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు టిడిపిని వీడిపోయారు. మరికొన్ని చోట అసంతృప్తి సెగలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. వైసిపి అసంతృప్తుల విషయానికి వస్తే మదనపల్లి, రాజంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించడం మినహా మిగిలిన 11 నియోజకవర్గాల్లో సిట్టింగులకే టికెట్‌ ఇవ్వడంతో అసంతృప్తుల బెడద తక్కువగా కనిపిస్తోంది. నామి నేషన్‌ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అసంతృప్త నేతలను బుజ్జగించే పనుల్లో నిమగమం కావడం గమనార్హం.ఉదయం నుంచే ప్రచారాల్లో.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆరాటం పెరిగిపోతోంది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి రోజూ ఉదయం ఏడు గంటల నుంచే అభ్యర్థులు అనుచరగణంతో కలిసి ప్రచా రంలో వాలిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంట లకు తిరుగుముఖం పడుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని తమకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి అధినేతలు బస్సు యా త్రల ద్వారా వరుసగా సభలు, సమావేశాలతో హీట్‌ పెంచుతున్నారు. కడప జిల్లాలో వైఎస్‌ కుటుంబంలో అనిశ్చితి నెలకొంది. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ తరుపున కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తుండడం, పులివెందుల అసెంబ్లీ బరిలో ఆ కుటుంబానికి చెందిన సభ్యులు పోటీ చేసే అవకాశం ఉండడంతో ప్రచారాల జోరు ఉధృతంగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కడప వైసిపి ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రచారాల జోరు పెంచేశారు. రోజూ జిల్లావ్యాప్తంగా కలియ దిరుగుతూ ప్రచారం సాగి స్తుండడం గమనార్హం. ఆత్మీయ సమావేశాలు…బుజ్జగింపులు టికెట్‌ దక్కని అసంతృప్త నేతలు ఆత్మీయ సమావేశాల నిర్వహణతో అలజడి పెంచుతున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో ప్రతిపక్ష టిడిపి నుంచి అసంతృప్తి జ్వాలలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. నెల రోజుల కిందట రాయచోటి టిడిపి ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి మొదలుకుని తాజాగా రాజంపేట టిడిపి ఇన్‌ఛార్జి బత్యాల వరకు పలువురు అసంతృప్తులు కార్యకర్తల సమావేశాలు, భారీ ర్యాలీలను నిర్వహిస్తూ అసంతృప్తి తీవ్రతను ఎగదోస్తున్నారు. కడపలో అసంతృప్త నేతలు లకీëరెడ్డి, అమీర్‌బాబు వంటి నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం రాత్రి రాయచోటి టిడిపి ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డిని రాజంపేట వైసిపి ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తుండడం గమనార్హం. ఇప్పటికే పలువురు టిడిపి ద్వితీయశ్రేణి నాయకులు వైసిపి కండువా కప్పుకున్నారు. మరి కొంతమంది అసంతృ ప్తులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కడప, రాయచోటి నియోజక వర్గాల్లోని అసంతృప్తుల సెగ ఎగిసిపడుతోంది. ప్రొద్దుటూరు లాంటి చోట్ల కొనిరెడ్డి లాంటి అసంతృప్త నాయకులను టిడిపి అభ్యర్థి తన వైపు తిప్పుకోగలిగారు. ఇదిలాఉండగా జిల్లా వ్యాప్తంగా టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులు పగలు ప్రచారాలు.. రాత్రిపూట బుజ్జగిం పులు, రాయభారాలు, మర్యాద పూర్వక కలయికల పేర్లతో అసంతృ ప్తులను కలుపుకుని పోవడానికి పావులు కదుపుతుండడం గమనార్హం.

➡️