శిబిరం నిద్ర నటించదు

Jan 29,2024 08:33 #sahityam

రాత్రికి రాత్రి

నేల రంగులు మార్చుకుంటుంది

కనురెప్పల్లో భద్రంగా దాచుకున్న కల

ఉదయానికల్లా

గచ్చుమీద పడి పగిలిపోతుంది

 

ఓడింది మాయాజూదంలో అని

సర్వం కోల్పోయిన తర్వాత గానీ అర్థం కాదు

చేసిన త్యాగానికి

రాజకీయం ట్యాగ్‌ తగిలిస్తారెవరో

రోడ్డున పడ్డ బతుకులు

శిబిరానికి పునాదిరాళ్లవుతాయి

 

రాలిన తేదీల్లో

లాఠీఛార్జ్‌ నెత్తుటి మరకలను తుడిపేదెవరు?

సాయంత్రపు తొక్కిసలాటల్లో

చితికిన జీవితాల్ని ఎవరు సరిచేస్తారు?

బద్దలైపోయిన కలను

ఎవరు అతికించి ఇస్తారు?

పైకప్పు నిండా ప్రశ్నలు వేలాడుతున్నా

శిబిరం కాళ్ళు ముందుకే నడుస్తాయి

 

ఎండా వానా చలి

అత్యుత్తమ ప్రతిభను చూపినందుకు

చప్పట్లు దక్కించుకుంటాయి

అంతా దొర్లిపోతూ వుంటుంది

శిబిరం మాత్రం

ఆకలిపేగులతో అక్కడే !

 

చీలిన దారుల వద్ద ఆగిపోయిన

నడకలు చెప్పే పాఠాలు విని

ఊ కొట్టడానికో, అడ్డంగా తలూపడానికో

సమయంలేని వాళ్ళల్లో నేనుంటాను

కాలంతోపాటు కొట్టుకుపోతున్న వాళ్ళల్లో

నువ్వూ వుంటావు

 

కన్నుమూస్తే

చేతులారా దానం చేసిన జీవితం గుచ్చుకుని

శిబిరానికి నిద్ర పట్టదు

కన్నీరు మండని క్షణం ఉండదు

అన్నంలో పురుగులు మసిలినట్టు

నిద్దట్లో ఒక ఉలికిపాటు!

 

శిబిరం నిద్రను నటించదు

మడమ తిప్పనని

తనకు తానుగా ప్రకటించుకున్న చేయిని

నమ్మడానికి వీల్లేదు

 

ఒక్క అన్నంముద్దను మూడు ముక్కలు చేసి

విసిరేయడంలోని అసలు గుట్టూ

ప్రాంతానికో కత్తిని కట్టి కోడెపందాలకు దింపిన

కపట చాతుర్యం వెనుక నిజానిజాలు

శిబిరానికే తెలుసు!

బలిసిన కొమ్ములు పట్టుకుని

రాజ్యం మెడ వొంచేంత వరకూ

ఒక నిర్ధిష్ట వెలుగు హామీ దొరికేవరకూ

శిబిరం అక్కడ్నుండి కదలదు !

– సా.మూ.

➡️