ఐద్వా జాతీయ సమావేశాల జయప్రదానికి పిలుపు

Dec 13,2023 10:30 #aidwa, #Punyavati

 

సంఘాన్ని విస్తరింపజేయాలన్న పుణ్యవతి

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే ఐద్వా జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్య వతి పిలుపునిచ్చారు. ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన డాబా గార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆహ్వాన కమిటీ సమావేశం మంగళ వారం జరిగింది. ఈ సమావేశంలో పుణ్యవతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పది వేలు ప్రభుత్వ స్కూళ్లు మూసివేశారని, తద్వారా లక్షల మంది పిల్లలకు విద్య కరువైంద న్నారు. 67 శాతం మంది పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉందని తెలిపారు. విశాఖలో పబ్లిక్‌ రంగాన్ని కాపాడుకునేందుకు మహిళా సంఘం ప్రత్యక్షంగా కృషి చేసిందన్నారు. షిప్‌యార్డు, బిహెచ్‌పివిలను కార్పొరేట్లకు అప్పగించనీయకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వ వాహనాలకు అడ్డుపడి ఆపారని తెలిపారు. ఇటువంటి పోరాటాల్లో మహిళా సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని ప్రభుత్వ రంగాన్ని కాపాడారని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడే పోరాటంలో కూడా మహిళా సంఘం ముందున్నదన్నారు. ఇండిస్టియల్‌, ఆటోనగర్‌, క్వారీ కార్మికుల పోరాటాల్లో కూడా మహిళా సంఘం ఎనలేని కృషి చేసిందన్నారు. మన శక్తి యుక్తులను పూర్తిగా ఉపయోగించి ఐద్వా జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని, మన సంఘాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. విశాఖ భవితవ్యం కాపాడటానికి ఈ సమావేశాలు వేదిక కావాలని, దాని కోసం అందరూ ఆర్ధిక, హార్థిక ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, రమాదేవి, సహాయ కార్యదర్శి ప్రియాంక, జిల్లా అధ్యక్షులు బి.పద్మ, ప్రొఫెసర్‌ నిర్మల, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్‌, ఐలు నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️