బస్సులు, రైళ్లు కిటకిట

Jan 11,2024 08:57 #Sankranti festival, #train
  • పండగకు సొంత ఊళ్లకు జనం పయనం

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : సంక్రాంతికి ఊరెళ్లాలి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి బస్సులు, రైళ్లే. పండగ సంతోషాలలో వీటి పాత్ర కీలకమైనది. అందుకే ఈసారీ పెద్ద పండగకు ఇవి కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సమయంలో బస్‌ టికెట్‌ ఛార్జీలను పెంచడం మొన్నటి వరకూ ఆనవాయితీగా ఉండేది. కానీ ఈసారి ఆర్‌టిసి బస్సు ఛార్జీలను ప్రభుత్వం పెంచలేదు. అదే సందర్భంలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్‌ టికెట్లను ముందుగానే రిజర్వ్‌ చేసుకుంటే అటు, ఇటు రెండు వైపులా ఛార్జీలో 10 శాతం తగ్గిస్తూ రాయితీ ప్రకటించారు. దీంతో ప్రయాణికులు విశాఖ ఆర్‌టిసి కాంప్లెక్స్‌కు అధికంగా తరలి వస్తున్నారు. ఈ నెల 9 నుంచి 18 వరకు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఇది వర్తిస్తుంది. దీంతో సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లేవారు బస్సుల కోసం తరలిరావడంతో స్థానిక ద్వారకా ఆర్‌టిసి కాంప్లెక్స్‌ బుధవారం కిటకిటలాడుతూ కనిపించింది.

ఇదే రద్దీ ఆదివారం వరకూ ఉంటుందని, వచ్చే బుధవారం నుంచి తిరుగు ప్రయాణికులతో బస్‌ స్టేషన్‌ రద్దీగా ఉంటుందని ఆర్‌టిసి అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి 250 బస్సులను అదనంగా నడుపుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, నరసాపురం, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం ప్రాంతాలకు బస్సులను అధికంగా వేసినట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా విశాఖ రైల్వే స్టేషనూ బుధవారం జన రద్దీతో కనిపించింది. ఎక్కడ చూసినా లగేజీలతో ప్రయాణికులే కనిపించారు.

➡️