తెగిపోయిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి!

  • ప్రారంభించిన రెండో రోజే ఘటన
  • తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నం బీచ్‌లో విఎంఆర్‌డిఎ ఆధ్వర్యాన నిర్మించి ఆదివారం ఉదయం రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి (నీటిపై తేలియాడే వంతెన) రెండో రోజునే తెగిపోయింది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు సాగరతీరంలో సుమారు 25 మీటర్ల మేర రూ.1.60 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బ్రిడ్జి సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో రెండుగా విడిపోయింది. సుమారు వంద మంది సందర్శకులు నిలబడే విధంగా రూపొందించిన ఈ ఫ్లాట్‌ ఫాం విడిపోయి సముద్రంలో వంద మీటర్ల దూరం కొట్టుకుపోయింది. ఆ సమయంలో సందర్శకులు ఎవరూ ఆ బ్రిడ్జిపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన నిర్వాహకులు మరమ్మతులు చేసే పనిలో పడ్డారు. తాళ్లు నాణ్యతగా లేకపోవడమే ఈ ఘటనకు కారణమై ఉంటుందని బీచ్‌ సందర్శకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జిపై నడిచేందుకు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.70 టికెట్‌ నిర్ణయించారు.

ఇది మాక్‌ డ్రిల్లు : అధికారుల వివరణ

ఫ్లోటింగ్‌ బ్రిడ్జి తెగిపోయిందనేది దుష్ట్రచారం మాత్రమేనని విఎంఆర్‌డిఎ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ నిర్వాహకులు ‘టి’ పాయింట్‌ (వ్యూ పాయింట్‌)ను బ్రిడ్జి నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించే నిమిత్తం ఏంకర్లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచామని తెలిపారు. సముద్ర ప్రవాహాలు తీవ్రంగా (హై టైడ్‌) ఉన్నప్పుడు ఇది సాధారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని, భవిష్యత్తులో ఇటువంటి మాక్‌ డ్రిల్‌ చేపడతామని పేర్కొన్నారు.

➡️