రోజులన్నీ ఒకేలా వుండవు
అనుకోని సందర్భంలోంచి
నా కలల సామ్రాజ్యంలోకి
కన్నీళ్లు గేట్లు తెరుచుకున్నాయి
ఇక్కడ ఉన్నదీ సైనికుడు
సంకల్పంతో యుద్ధం చేస్తూనేఉన్నాడు
గెలవడానికి ఒకింత ఓదార్పు
మరింత నేర్పు కాలంతో పోరాడాయి
ఎన్ని ముచ్చట్లు కోల్పోయినా
ఎన్ని చీకట్లు కట్లు తెంచినా
బలాన్ని ధైర్యంగా ముందుకు
నడపటంతోనే యుద్ధం మొదలైంది
వెన్నెల్ని చూడటం అలవాటైన దృష్టి
కన్నీళ్ల దశ్యాల్ని చూడాలనుకోదు
కష్టం ఆవలి ఒడ్డున విజయం
పిలుస్తోంది
మరో శిఖరం అధిరోహించమంటోంది
మనవి కాని కాలాలు
మనల్ని కొన్ని తడుతుంటాయి
దిగుల్ని దిగమింగుకుంటూ
సాధించిన విజయాలపై నిలబడి
ఆనందాన్ని రెపరెపలాడించడమే కదా
జీవితం
కన్నీళ్ల వంతెన దాటడం
నమ్మకాన్ని పునాదులు చేసుకుని
గెలవడం
ఓడినా గెలిచినా దూసుకు పోవడం
లక్ష్యాన్ని సాధించటం..
క్షణాల్ని మెరిపించే ఆకాంక్షే
జీవితాన్ని వెలిగిస్తూ నడిపిస్తుంది..!
గవిడి శ్రీనివాస్
7019278368