ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకూ విధుల బహిష్కరణ

  • 13 జిల్లాల న్యాయవాద సంఘాల ఏకగ్రీవ తీర్మానం
  • భూ హక్కు చట్టం రద్దు చేసే వరకూ పోరాటం

ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ (గుంటూరు జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని, ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని 13 జిల్లాల ఉమ్మడి న్యాయవాద సంఘాలు స్పష్టం చేశాయి. భూ హక్కు చట్టం వల్ల కలిగే దుష్పరిణామాలపై గుంటూరు జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కెవికె.సురేష్‌ అధ్యక్షతన రాష్ట్రంలోని వివిధ బార్‌ అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులతో శనివారం గుంటూరులో విస్తృత సమావేశం నిర్వహించారు. యాజమాన్య హక్కు అనేది రాజ్యాంగం ద్వారా కల్పించబడిందని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా ప్రజల నుంచి ఆ హక్కును లాక్కోవాలని చూడటం దుర్మార్గమైన చర్యగా వక్తలు నిర్ణయించారు. ఈ చట్టం ద్వారా బలవంతులకే ఆస్తి చెందుతుందని, సామాన్యులు ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. యాజమాన్య హక్కు నిర్ధారణను రెవెన్యూ అధికారులకు కట్టబెట్టటం విడ్డూరమని, అధికారపక్షం చెప్పు చేతల్లో నడిచే రెవెన్యూ అధికారుల దయాదాక్షిణ్యాలపై సామాన్యులు ఆస్థి యాజమాన్య హక్కు ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌లు, అడంగల్‌లు వంటి రికార్డులు రద్దు అవుతాయని చెప్పారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకునేందుకు సివిల్‌ కోర్టు విచారణ పరిధిని ఈ చట్టం ద్వారా తీసివేయటం శోచనీయమన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించాలని, త్వరలో రానున్న సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయ వాదులు కోర్టు విధులను బహిష్కరించా లని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎపి యాజమాన్య హక్కు చట్టం దుష్పలితాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఈ చట్టం రద్దుకు ప్రజల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ తిరిగి బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని తీర్మానించారు. ఈ సదస్సులో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సోమసాని బ్రహ్మానందరెడ్డి, మాజీ బార్‌ అధ్యక్షులు శాంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మహిళా ఎపిపి మృతి

ఈ సదస్సులో పాల్గొన్న విశాఖపట్నం మెజిస్ట్రేట్‌ కోర్టు అడిషన్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. విశాఖ నుంచి వచ్చిన ఆమె ఈ కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికే గుండెపోటుతో ఆమె కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

➡️